Amalapuram: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం.. కోనసీమ కలెక్టర్
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ భూ సమస్యల పరిష్కారం మరియు రీ-సర్వేపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.
Amalapuram: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం.. కోనసీమ కలెక్టర్
Amalapuram: రెవిన్యూ సేవలలో పారదర్శకత, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి రెవిన్యూ అధికారి జవాబు దారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, భూపరిపాలన ముఖ్య కమిషనర్ జి.సాయిలక్ష్మి లు వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 22 a భూములు, రీ సర్వే పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ, రెవెన్యూ రిజిస్టర్, ఐవిఆర్ఎస్, పిజిఆర్ఎస్ ఫీడ్బ్యాక్ నివేదికల పురోగతిపై సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారం, రీ-సర్వే ప్రక్రియ వేగవంతం ప్రజా ఫిర్యాదుల తక్షణ పరిష్కారంపై కీలక ఆదేశాలు జారీ చేశారుజిల్లాలో 22-A నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై సమగ్ర విచారణ జరిపి, అర్హత కలిగిన భూములను జాబితా నుండి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టపరమైన చిక్కులు లేని భూములకు సంబంధించి రైతులకు త్వరితగతిన ఉపశమనం కలిగించాలన్నారు.
రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటికే పట్టాల పంపిణీ జరగగా, మిగిలిన గ్రామాల్లో సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. రీ-సర్వే రికార్డుల ఆధారంగా ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎటువంటి జాప్యం లేకుండా నేరుగా రైతులకు పంపిణీ చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు.భూ మార్పిడి,వారసత్వ సంక్రమణ వంటి అంశాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేసి, ఆన్‌లైన్ డేటాతో సరిపోల్చాలన్నారు.
రికార్డుల్లో తప్పులు లేకుండా చూడటం అధికారుల బాధ్యత అని జిల్లాకలెక్టర్ స్పష్టం చేశారు.పి.జి.ఆర్. ఎస్ ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నాణ్య మైన పరిష్కారం చూపాలన్నారు ఫిర్యాదుదారులతో ఐ.వి.ఆర్.ఎస్ ద్వారా నేరుగా మాట్లాడి, వారి సంతృప్తి స్థాయిని అంచనా వేసి 100% సంతృప్తిని మెరుగుపరచాలన్నారు. పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు, సామాన్య ప్రజలు తమ భూసమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలను సులభతరం చేయాలన్నారు. రీ-సర్వే ప్రారంభించే ముందు గ్రామాల్లో నోటీసులు ఇచ్చి రైతులకు సమాచారం అందించాలన్నారు. సరిహద్దుల గుర్తింపు రైతుల సమక్షంలో భూమి సరిహద్దు రాళ్లను పాత రికార్డుల ప్రకారం గుర్తిస్తారన్నారు. సరిహద్దులు గుర్తించిన తర్వాత డ్రోన్ల ద్వారా ఫోటో గ్రామెట్రీ సర్వే చేపట్టాలన్నారు. సర్వే తర్వాత తయారైన మ్యాపులను గ్రామ సచివాల యాల్లో ప్రదర్శించి, రైతుల అభ్యంతరాలను స్వీకరించాలన్నారు.
అభ్యంతరాల పరిష్కారం తర్వాత భూమి యజమానికి కొత్త పాస్ పుస్తకం మరియు మ్యాప్ అందజేయాలన్నారు. ప్రతి సర్వే నంబర్‌కు ఖచ్చితమై న హద్దులు ఉండటం వల్ల పొరుగువారితో వచ్చే సరిహద్దు తగాదాలు తగ్గుతాయన్నారు.ప్రతి భూమికి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుంది. దీనివల్ల భూమి ఎక్కడుందో ఆన్‌లైన్‌లో సులభంగా గుర్తించవచ్చునన్నారు రికార్డులు పక్కాగా ఉండటం వల్ల భూమి కొనుగోలు చేసేటప్పుడు మోసపోయే అవకాశం ఉండదన్నారు.
ఏదైనా పొరపాటు జరిగితే మొబైల్ కోర్టులు లేదా రెవెన్యూ అధికారుల ద్వారా వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్నారు.ఈ రీ-సర్వే ద్వారా భూరికార్డులు పూర్తిగా డిజిటలైజ్ చేయబడి, భవిష్యత్తులో భూముల నిర్వహణ మరింత పారదర్శకంగా మారుతుందన్నారు. మడ అడవుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియాదేవి, ఆర్డీవోలు జి మమ్మీ, బి భాగ్యవతి, సర్వే ఏడి కే.ప్రభాకర్, సూపరింటెండెంట్లు సుబ్బరాజు నాగలక్ష్మమ్మ, కొత్తపేట ఆర్డీవో కార్యాలయ ఏవో శ్రీదేవి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.




