Amalapuram: ఐదు నెలల నరకం.. కలెక్టర్ కృషితో తిరిగొచ్చిన ప్రాణం!

Amalapuram: ఖతార్‌లో ఐదు నెలల పాటు వేధింపులకు గురైన కోనసీమ జిల్లా మహిళ కనకదుర్గను జిల్లా కలెక్టర్ చొరవతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సురక్షితంగా రప్పించింది.

PRABHU, RAZOLE
Published on: 5 May 2026 9:24 PM IST
Amalapuram
X

Amalapuram: ఐదు నెలల నరకం.. కలెక్టర్ కృషితో తిరిగొచ్చిన ప్రాణం!

Amalapuram: ఉపాధి కోసం ఖతార్ దేశం వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కోనసీమ జిల్లాకు చెందిన మహిళ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రత్యేక చొరవతో సురక్షితంగా మంగళవారం భారతదేశానికి చేరుకున్నారు. డాక్టర్..బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, కొమరాడ గ్రామానికి చెందిన డి.కనక దుర్గ అమలాపురానికి చెందిన ఏజెంట్ ఎ. శ్రీని వాసరావు ద్వారా నవంబర్ 2024 లో ఖతార్ వెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో పనికి చేరిన ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

ఖతార్ లో ఇంటి యజమాని భార్యాభర్తల గొడవల కారణంగా దుర్గను తీవ్రంగా వేధించడమే కాకుండా, కనీసం సరైన ఆహారం కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురి చేసేవారని, ఐదు నెలల పాటు నరక యాతన అనుభవించిన దుర్గ.., ఆ బాధలు భరించలేక అక్కడి నుండి తప్పించుకుని తనను పంపిన ఆఫీసుకు చేరుకున్నారు.అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు.

వేర్వేరు ఇళ్లలో పది రోజులు, వారం రోజులు చొప్పున పని చేయిస్తూ, ఎటువంటి జీతం ఇవ్వకుండా ఆమెను మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారు. దీనితో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బాధితురాలు తన భర్త నాగరాజుకు ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకోగా, ఆయన జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించారు. విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి,

బాధితురాలిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక వలసదారుల కేంద్రాన్ని ఆదేశించారు.కేంద్ర సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ ఆధ్వర్యంలోని బృందం వెంటనే రంగంలోకి దిగి, సంబంధిత ఏజెంట్‌తో మాట్లాడి చట్టపరమైన ఒత్తిడి తీసుకువచ్చారు. ఫలితంగా కనకదుర్గను సురక్షితంగా రప్పించగలిగారు.తమకు కష్టకాలంలో అండగా నిలిచి, భార్యను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చినందుకు కనకదుర్గ కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ , కె.సి.ఎం బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story