Tuni: లోవ తలంపులమ్మ ఆలయంలో ముగిసిన రాజగోపుర శిఖర ప్రతిష్ఠ!

Tuni: ప్రముఖ పుణ్యక్షేత్రమైన లోవ శ్రీ తలంపులమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన ఐదు అంతస్తుల రాజగోపుర శిఖర ప్రతిష్ఠా మహోత్సవం

MANIKANTA, TUNI
Published on: 8 July 2026 5:47 PM IST
Tuni
X

Tuni: లోవ తలంపులమ్మ ఆలయంలో ముగిసిన రాజగోపుర శిఖర ప్రతిష్ఠ!

తుని: ప్రముఖ పుణ్యక్షేత్రమైన లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలంపులమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతన రాజగోపుర శిఖర ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది.

సుమారు 120 అడుగుల ఎత్తుతో, 108 దేవీ అవతారాల విగ్రహాలతో నిర్మించిన ఈ ఐదు అంతస్తుల రాజగోపురం శిఖర ప్రతిష్ఠా కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించగా, నేడు ఆఖరి రోజున వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా పూర్తయింది.

*శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు*

ఆలయ కార్యనిర్వహణాధికారి పి.విశ్వనాధ రాజు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పెంటకోట భాస్కర సత్యనారాయణ మరియు ధర్మకర్తల మండలి సభ్యుల పర్యవేక్షణలో, స్మార్తాగమ పద్ధతులతో శిఖర ప్రతిష్ఠా కార్యక్రమాలను చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల హోరులో 9 కలశాలను రాజగోపురంపై ప్రతిష్ఠించారు.

*పోటెత్తిన భక్తజనం

అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించే తుని రాజా వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పిండివంటలను సమర్పించారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో కాలినడకన, వాహనాల్లో తరలివచ్చి, వివిధ రకాల వాయిద్యాలతో సారె తీసుకురావడం ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. భక్తుల ‘తలంపులమ్మ తల్లి’ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పూజలో నివేదించిన పూర్ణం బూరెలను శిఖరం పైనుండి భక్తులకు ప్రసాదంగా విసరగా, వాటిని అందుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు.

*అధికారుల పర్యవేక్షణ, వేదాశీర్వచనం*

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమీషనర్ వి.త్రినాథ రావు, కాకినాడ ఉప కమీషనర్ డి.యల్.వి. రమేష్ బాబు, విజయవాడ ఎస్.ఇ. దుర్గేష్, కాకినాడ డి.ఇ. ఉదయ్ కుమార్, ఉప స్థపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో వేద పండితులు భక్తులకు, అతిథులకు వేదాశీర్వచనం అందించారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు యనమల రాజేష్, మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు, పలువురు ఆలయ మాజీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను, ఉచిత అన్నప్రసాదాన్ని ఆలయ యంత్రాంగం అందజేసింది.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story