Pithapuram: గొల్లప్రోలులో రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు
Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు విస్తృత పర్యటన. కార్యకర్తలతో ముఖాముఖి, గొల్లప్రోలులో రైస్ మిల్ ప్రారంభం.
Pithapuram: గొల్లప్రోలులో రైస్ మిల్ ప్రారంభించిన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు
కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు విస్తృతంగా పర్యటించారు. ముందుగా కాకినాడ జిఆర్టి నుండి బయలుదేరిన ఆయన, పిఠాపురం కుమార్‌పురంలోని గోకులం గ్రాండ్‌లో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షత వహించగా, నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు.
ప్రతి గ్రామంలో రోడ్లు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వంలో అందుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో పవన్ కళ్యాణ్ కృషి విశేషమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి వార్డు స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. అనంతరం గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్న నాగబాబు , అన్నం దేవర పట్టాభిరామయ్య నిర్మించిన నూతన రైస్ మిల్ “శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర” ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పడితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రైతులకు సరైన ధరలు లభించేలా ఇలాంటి మిల్లులు దోహదపడతాయని తెలిపారు.
కార్యక్రమం అనంతరం పిఠాపురంలోని పాతగయా క్షేత్రాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదురి కిషోర్, పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్యప్రకాష్, మండల ఇంచార్జ్ వెన్న జగదీష్, నియోజకవర్గ ఇంచార్జ్ డా. వరలక్ష్మి, గొల్లప్రోలు మండల ఇంచార్జి జ్యోతుల శ్రీనివాస్, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు చల్ల లక్ష్మి, పెంకే జగదీశ్, సూరిశెట్టి జయకృష్ణ, దానం లాజర్ బాబు, మొగలి అప్పారావు తదితరులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




