Peddapuram: పెద్దాపురంలో డీఎస్పీ తిలక్ నేర సమీక్షా సమావేశం
Peddapuram: పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, 25% పెండింగ్ కేసుల తగ్గింపు లక్ష్యంగా పోలీసులతో డీఎస్పీ ఏబీజీ తిలక్ నేర సమీక్ష నిర్వహించారు.
Peddapuram: పెద్దాపురంలో డీఎస్పీ తిలక్ నేర సమీక్షా సమావేశం
కాకినాడ జిల్లా: పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ ఏబీజీ తిలక్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని డీఎస్పీ సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి కోర్టుల నుంచి తీసుకోవాల్సిన నంబర్లను సీఐలు, ఎస్ఐలు స్వయంగా కోర్టులకు వెళ్లి తీసుకోవాలని సూచించారు. కేసుల పెండెన్సీని 25 శాతం తగ్గించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. 'డ్రగ్స్ వద్దు బ్రో', సైబర్ క్రైమ్, మహిళలపై నేరాల నివారణ, పల్లెనిద్ర, వాష్ అండ్ గో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
నైట్ బీట్స్, డే బీట్స్, క్రైమ్ బీట్స్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నిర్వహించాలని, నైట్ ఇంచార్జిలు, నైట్ రౌండ్స్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. బీట్స్ తనిఖీలను పక్కాగా నిర్వహించాలని సూచించారు.
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతమైన ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు చొరవ చూపాలని, నేరాల నియంత్రణలో డ్రోన్ కెమెరాలను విస్తృతంగా వినియోగించాలని సూచించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఎస్పీ ఏబీజీ తిలక్ పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.




