Peddapuram: రూ.21 కోట్లతో పెద్దాపురం అభివృద్ధి పనులు: చినరాజప్ప
Peddapuram: పెద్దాపురం పట్టణంలో హ్యామ్ నిధులు రూ.21 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శంకుస్థాపన చేశారు.
Peddapuram: రూ.21 కోట్లతో పెద్దాపురం అభివృద్ధి పనులు: చినరాజప్ప
పెద్దాపురం: పెద్దాపురం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తరఫున అహర్నిశలు కృషి చేస్తున్నామని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు.
మంగళవారం పెద్దాపురం పట్టణంలోని స్థానిక రామారావుపేటలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) నిధులతో సుమారు రూ.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దాపురం కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వారి ఇరువురు మాట్లాడుతూ పట్టణంలో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పార్కుల అభివృద్ధి వంటి పనులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
పెద్దాపురం పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను నాణ్యతతో పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.




