Pithapuram: కందరాడలో రైతుకు చంపుతామని బెదిరింపులు పోలీసులకు విజ్ఞప్తి!

Pithapuram: కందరాడ గ్రామానికి చెందిన రైతు దేసినెట్టి వెంకటేశ్వరరావు తన భూమి విషయంలో కొందరు వ్యక్తులు చంపేస్తామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని వేడుకున్నారు

V. Ramakrishna, Pithapuram
Published on: 13 Aug 2026 5:10 PM IST
Pithapuram
X

Pithapuram: కందరాడలో రైతుకు చంపుతామని బెదిరింపులు పోలీసులకు విజ్ఞప్తి!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రైతు దేసినెట్టి వెంకటేశ్వరరావు, తన భూమి విషయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం 2025లో ఎల్‌పీ నంబర్‌ 600లోని 26 సెంట్ల భూమిని ఎఫ్‌కే పాలానికి చెందిన భూమిగా కొనుగోలు చేసి, చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డులు, పత్రాలు తన వద్ద ఉన్నాయని, ప్రస్తుతం కూడా తామే ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

అయితే భూమిని తనకు విక్రయించిన నల్ల గంగారావు ప్రస్తుతం వచ్చి సదరు భూమి తమదేనంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై భయభ్రాంతులకు గురిచేయడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్‌ ఆర్డర్‌ కూడా పొందినట్లు తెలిపారు.

ఈ క్రమంలో బుధవారం తాను పొలంలో పనులు చేసుకుంటుండగా కేసిరెడ్డి శివ, స్వామి, రాంబాబు, మంగ తదితరులు అక్కడికి వచ్చి తనను చంపేస్తామని బెదిరించినట్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు. భూమికి సంబంధించిన అన్ని రికార్డులు తన వద్ద ఉన్నాయని, న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కూడా గౌరవించాలని కోరారు.

తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు.. సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు భూమి రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి, తనకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story