Pithapuram: పిఠాపురంలో ఆదిత్య పాఠశాల వద్ద ఉద్రిక్తత.. ఆందోళనలో తల్లిదండ్రులు
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం ఆదిత్య పాఠశాల వద్ద ఆర్టీఈ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన.
Pithapuram: పిఠాపురంలో ఆదిత్య పాఠశాల వద్ద ఉద్రిక్తత.. ఆందోళనలో తల్లిదండ్రులు
కాకినాడ జిల్లా: ఆదిత్య పాఠశాల వద్ద ఆర్టీఈ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన… సమస్య పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేరిన విద్యార్థులను ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తల్లిదండ్రుల ఆవేదన.
పిఠాపురం ప్రభుత్వ విద్యా హక్కు చట్టం (RTE) నిబంధనల ప్రకారం పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆదిత్య పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.
ఆర్టీఈ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులను అధిక ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇప్పటికే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల ఆవరణలో పుస్తకాలు, దుస్తుల విక్రయాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తల్లిదండ్రులు బుక్స్ ఉన్న గదికి తాళం వేశారు. ఈ విషయం పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు పాఠశాల ఆవరణలోనే నిరసన కొనసాగిస్తామని తెలిపారు.
సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బుక్స్ రూమ్‌కు సీల్ వేసి విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
మరోవైపు మీడియా తమ సమస్యను చిత్రీకరిస్తున్న సమయంలో కొందరు సిబ్బంది వ్యవహరించిన తీరుపై కూడా తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని తెలిపారు.
అడ్మిషన్ రద్దు చేస్తే ఇతర పాఠశాలల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని, పిల్లల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడాలని తల్లిదండ్రులు కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు విషయంలో నిర్లక్ష్యం కాకుండా పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
బుక్స్ ఉన్న రూమ్ అధికారులు సీజ్ చేయడం జరిగింది.




