Peddapuram: పెద్దాపురం ఎంపీపీగా సాల్మన్ రాజు, వైస్ ఎంపీపీగా నాగబాబు ఏకగ్రీవం!
Peddapuram: పెద్దాపురం ఎంపీపీగా టీడీపీ నేత సైనం సాల్మన్ రాజు, వైస్ ఎంపీపీగా జనసేన నేత కొప్పిరెడ్డి నాగబాబు గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Peddapuram: పెద్దాపురం ఎంపీపీగా సాల్మన్ రాజు, వైస్ ఎంపీపీగా నాగబాబు ఏకగ్రీవం!
పెద్దాపురం: పెద్దాపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు గురువారం నిర్వహించిన పరోక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సైనం సాల్మన్ రాజు అధ్యక్షుడిగా, జనసేన పార్టీకి చెందిన కొప్పిరెడ్డి నాగబాబు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్దాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి పి.బి.యం.యం. కుమార్ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన పాల్గొన్నారు. తొలుత ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం సభ్యులనుద్దేశించి ప్రసంగించారు.
అనంతరం అధ్యక్ష పదవికి నిర్వహించిన ఎన్నికలో రాయభూపాలపట్నం ఎంపీటీసీ సభ్యుడు సానిపిన సురేష్ (టీడీపీ) ఆనూరు ఎంపీటీసీ సభ్యుడు సైనం సాల్మన్ రాజు (టీడీపీ) పేరును ప్రతిపాదించగా, కట్టమూరు-1 ఎంపీటీసీ సభ్యురాలు అడపా శివదుర్గ (జనసేన) బలపరిచారు. అధ్యక్ష పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సైనం సాల్మన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి గుడివాడ/సిరివాడ ఎంపీటీసీ సభ్యుడు అంబటి రాంబాబు (జనసేన) చదలాడ ఎంపీటీసీ సభ్యుడు కొప్పిరెడ్డి నాగబాబు పేరును ప్రతిపాదించగా, గోరింట ఎంపీటీసీ సభ్యురాలు పచ్చిపాల వెంకట నాగ గంగ దుర్గా ప్రవల్లిక (టీడీపీ) బలపరిచారు. ఈ పదవికి కూడా ఒక్క ప్రతిపాదన మాత్రమే రావడంతో కొప్పిరెడ్డి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన ప్రిసైడింగ్ అధికారి పి.బి.యం.యం. కుమార్ పెద్దాపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా సైనం సాల్మన్ రాజు, ఉపాధ్యక్షుడిగా కొప్పిరెడ్డి నాగబాబు ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.కొత్తగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులను సభ్యులు హర్షధ్వానాల మధ్య అభినందించారు. దీంతో పెద్దాపురం మండల ప్రజా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఏకగ్రీవంగా ముగిసింది.




