Tuni: తుని రహదారిపై వరుస ప్రమాదాలు అధికారుల నిర్లక్ష్యం
Tuni: తుని జాతీయ రహదారిపై ప్రమాదాల పరంపర. డివైడర్లకు రేడియం స్టిక్కర్లు, బోర్డులు లేక ప్రజల ఇబ్బందులు. అధికారుల తీరుపై నిప్పులు చెరుగుతున్న స్థానికులు.
Tuni: తుని రహదారిపై వరుస ప్రమాదాలు అధికారుల నిర్లక్ష్యం
తుని: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు జరుగుతున్నా, సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన, ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది.
గత ప్రమాదం.. అధికారుల
గతంలో ఇదే ప్రదేశంలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలై, కాళ్లు, చేతులు విరిగి ఆసుపత్రి పాలయ్యారు. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఈ ప్రమాదం తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదు. నిబంధనల ప్రకారం డివైడర్లకు రేడియం స్టిక్కర్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సింది పోయి, సంబంధిత శాఖ అధికారులు మొక్కుబడిగా కేవలం వైట్ పెయింట్ వేసి చేతులు దులుపుకున్నారు.
ప్రశ్నిస్తున్న స్థానికులు: "అధికారుల ఉద్దేశ్యం ఏమిటి? ప్రాణనష్టం జరిగితేనే స్పందిస్తారా?" అని స్థానిక ప్రజలు, ప్రయాణికులు మండిపడుతున్నారు. భారీగా ప్రాణ నష్టం జరిగితేనే అధికారులు మేల్కొంటారా? అటువంటి విషాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ శాఖకు లేదా? అని నిలదీస్తున్నారు.
గతంలో కూడా ఈ అంశంపై మీడియా మిత్రులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, స్పందన శూన్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ, అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వెనుక ఉన్న నిర్లక్ష్యం ఎవరిది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
డిమాండ్: ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ప్రమాదకరమైన ఈ ప్రదేశాన్ని గుర్తించాలని, డివైడర్లకు నాణ్యమైన రేడియం స్టిక్కర్లు మరియు సరైన సూచన బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా, భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు




