Kakinada: కాకినాడ రూరల్లో ముంపు నీటి సమస్య!
Kakinada: కాకినాడ రూరల్ వాకలపూడి వినాయక రామకృష్ణ నగర్లో ముంపు నీటి సమస్యపై కాలనీవాసుల రాస్తారోకో. 150 ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని కాలనీవాసుల ఆవేదన.
Kakinada: కాకినాడ రూరల్లో ముంపు నీటి సమస్య!
Kakinada: వాకలపూడి గ్రామంలోని వినాయక రామకృష్ణ నగర్ కాలనీలో ముంపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు రోడ్డును నిర్బంధించి ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. ముంపు సమస్యపై ఇప్పటివరకు సుమారు 150 ఫిర్యాదులు చేసినప్పటికీ ఒక్క ఫిర్యాదుకూ సరైన పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొందని తెలిపారు.
కాలనీలోని 13 రహదారులు పూర్తిగా ముంపు నీటితో నిండిపోయాయని, నీటిలో గుర్రపు డెక్క పెరిగిపోవడంతో పాటు ఇళ్లలోకి పాములు, విషపురుగులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్నప్పటికీ కనీసం ఒక్క అధికారి కూడా కాలనీని సందర్శించి సమస్యను పరిశీలించలేదని ఆరోపించారు. తాగునీరు, చిన్నపిల్లలకు పాలు వంటి కనీస అవసరాలు కూడా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు.
పంచాయతీ ఈఓ పాండురంగారావుకు సమస్యను తెలియజేసినా పట్టించుకోవడం లేదని, తాను ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని పేర్కొంటూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కొందరు కాలనీవాసులు ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి కాలనీలోని ముంపు నీటిని తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.




