Tuni: ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ.2 కోట్ల సీఎస్ఆర్ నిధులు: ఎమ్మెల్యే

Tuni: కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం

MANIKANTA, TUNI
Published on: 27 Jun 2026 5:31 PM IST
Tuni
X

Tuni: ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ.2 కోట్ల సీఎస్ఆర్ నిధులు: ఎమ్మెల్యే

కాకినాడ జిల్లా: తుని ఏరియా ఆసుపత్రిని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు. తుని కూటమి కార్యాలయంలో ఆమె అధ్యక్షతన ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అజెండా అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది.

మెరుగైన వసతులే లక్ష్యం:

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ, గతం కంటే ప్రస్తుతం ధర్మాస్పత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) నిధులను సమర్థవంతంగా వినియోగించి, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామన్నారు.

​దక్కన్ కెమికల్స్ సాయం:

ఆసుపత్రి మౌలిక సదుపాయాల కల్పన కోసం తన విజ్ఞప్తి మేరకు దక్కన్ కెమికల్ యాజమాన్యం స్పందించి, రూ. 2 కోట్ల నిధులను అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ నిధులతో ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

భవిష్యత్తులో తుని ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఎమ్మెల్యే దివ్య వెల్లడించారు. తద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

​ఈ సమావేశంలో టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి, మండల టీడీపీ అధ్యక్షురాలు తామరాన వరలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్‌తో పాటు అభివృద్ధి కమిటీ సభ్యులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, తటవర్తి రాజా, పూడి సత్యవేణి, రాజాల నిర్మల తదితరులు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI

Next Story