Sircilla: ఏడాది పాలనలో ప్రత్యేక ముద్ర.. సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రగతి బాట
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమ అగ్రవాల్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రత్యేక ముద్ర వేశారు.
Sircilla: ఏడాది పాలనలో ప్రత్యేక ముద్ర.. సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రగతి బాట
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమ అగ్రవాల్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ కాలంలో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, పర్యాటకం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిపాలన సాగించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు చేపట్టడంతో పాటు, జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి*
అర్హుల సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. హౌసింగ్ శాఖ అధికారులు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏడాది కాలంలో 3 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు.
*విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం*
ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. విద్యార్థుల హాజరు, బోధన, ఆహార నాణ్యతను పరిశీలిస్తూ కామన్ డైట్ మెనూ అమలుపై పర్యవేక్షణ చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, ఇన్సినిరేటర్లు, ఫ్రీజర్లు, సోలార్ ఫెన్సింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయించారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నారు.
*పిల్లల పోషణపై ప్రత్యేక కార్యక్రమం*
పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి మంగళవారం 10 నిమిషాలు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పిల్లల ఎత్తు, బరువు నమోదు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరీక్షలపై పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లాలోని 586 అంగన్వాడీ కేంద్రాలకు భవన వసతి కల్పించే లక్ష్యంతో అసంపూర్తిగా ఉన్న 48 భవనాల నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు. మరో 10 భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. 153 కేంద్రాల్లో పోషణ వాటికలు ఏర్పాటు చేయించారు. 37 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
*దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి చర్యలు*
దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాల పంపిణీకి చర్యలు చేపట్టారు. అలింకో సంస్థ ద్వారా రూ.83 లక్షల విలువైన పరికరాలు, బ్యాటరీ సైకిళ్లు సమకూర్చారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 16,631 మందికి రూ.2.93 కోట్ల విలువైన వీల్చైర్లు, వాకింగ్ కర్రలు, రోలేటర్లు తదితర పరికరాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో తాగునీరు, సోలార్ విద్యుత్ సదుపాయాలు కల్పించారు. పండుగల సందర్భంగా వృద్ధులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
*ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం*
ఎల్‌నినో ప్రభావం, నీటి వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామసభలు, రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తూ పంటల వైవిధ్యంపై చైతన్యం కల్పిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను ప్రతి మంగళవారం సందర్శించి దిగుబడి, ఆదాయం వివరాలను తెలుసుకుంటున్నారు. ఆయిల్‌పామ్ సాగు ప్రయోజనాలు, ప్రభుత్వ రాయితీలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో కొత్తగా 700 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు.
*రాజన్న ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణ*
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆలయ విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణం, 80 అడుగుల రహదారి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి పర్యవేక్షించారు. మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేశారు.
*పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం*
వేములవాడ గుడి చెరువు బండ్ పార్కును సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు మొక్కలు, విద్యుత్ దీపాలు, సప్తమాతృక విగ్రహాలు, 40 అడుగుల శివుడి విగ్రహం వంటి ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేశారు. నాంపల్లి గుట్టపై భారత వైమానిక దళం వినియోగించిన విమానాన్ని ఏర్పాటు చేయించి పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వైభవాన్ని చాటేలా రగుడు జంక్షన్ వద్ద విగ్రహాలను ఏర్పాటు చేయించారు.
*ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై పర్యవేక్షణ*
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది హాజరు, గర్భిణుల వైద్య పరీక్షలు, మందుల పంపిణీపై సమీక్షిస్తున్నారు. 2025 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ వైద్య సంస్థల్లో 3,344 ప్రసవాలు జరిగాయి. గర్భిణుల నమోదు లక్ష్యం 10,349 కాగా, 9,863 మంది నమోదయ్యారు. గర్భిణులు, పిల్లలకు టీకాల పంపిణీ 100 శాతం పూర్తయినట్లు నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో 421 మంది టీబీ బాధితులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
*ఎన్నికల నిర్వహణలో గుర్తింపు*
ఎన్నికల నిర్వహణలో సమర్థతకు గాను గరిమ అగ్రవాల్ ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డుకు ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా పనిచేసిన సమయంలో ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినందుకు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అప్పటి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికలను సైతం వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు.
*ఉపాధి హామీ పనుల్లో ముందంజ*
వీబీ జీ రామ్ జీ కింద ఉపాధి హామీ పనుల కల్పనలో జిల్లా రాష్ట్రంలో ముందంజలో నిలిచింది. గ్రామాల్లో శాశ్వత ఆస్తుల కల్పన, వనరుల సంరక్షణ పనులను చేపడుతున్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇప్పిస్తూ కూలీలకు విస్తృతంగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి సగటున 45 మంది కూలీలు పనులకు హాజరవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
*ఆరోగ్యకరమైన వాతావరణం, రహదారి భద్రత*
పరిసరాల పరిశుభ్రత, తాగునీటి ట్యాంకుల శుభ్రతపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి నెలా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ ప్రమాద ప్రాంతాలను పరిశీలించి అవసరమైన మరమ్మతులు, సూచిక బోర్డుల ఏర్పాటుపై సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇస్తున్నారు.
*మహిళా సంఘాలకు భవనాలు*
మహిళా సంఘాల కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా సిరిసిల్లలో రూ.5 కోట్లతో నిర్మించిన జిల్లా ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 167 వీఓ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు 21 భవనాలు పూర్తయ్యాయి. మిగిలిన భవనాల పనులు వేగంగా పూర్తయ్యేలా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
జిల్లా కలెక్టర్‌గా ఏడాది పాలనలో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి వంటి విభిన్న రంగాలపై దృష్టి సారిస్తూ గరిమ అగ్రవాల్ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరడం, ప్రజలకు మెరుగైన సేవలు అందడం, అభివృద్ధి పనులు వేగవంతం కావడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు.




