Sircilla: సిరిసిల్లలో ప్రత్యేక ఆకర్షణగా రామ్ లాల్ మండపం గణనాథుడు
Sircilla: రాజన్న సిరిసిల్లలోని రామ్ లాల్ మండపంలో 2016 జర్మన్ సిల్వర్ ప్రతిమలతో రూపొందించిన 11 అడుగుల వినూత్న గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Sircilla: సిరిసిల్లలో ప్రత్యేక ఆకర్షణగా రామ్ లాల్ మండపం గణనాథుడు
సిరిసిల్ల: చేనేత కళకు పెట్టింది పేరైన రాజన్న సిరిసిల్ల పట్టణం వినాయక చవితి ఉత్సవాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. సిరిసిల్లలోని రామ్ లాల్ మండపం నిర్వాహకులు ఈ ఏడాది వినూత్నంగా 2016 చిన్న జర్మన్ సిల్వర్ వినాయక ప్రతిమలను ఒకచోట పేర్చి 11 అడుగుల మహా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ధగధగ మెరిసే ఈ ప్రత్యేక గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.
రామ్ లాల్ మండపం ఏర్పాటై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వినూత్న గణపతిని రూపొందించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన నిపుణులైన కళాకారులతో విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ జర్మన్ సిల్వర్ గణపతి రూపకల్పనకు సుమారు రూ.2.50 లక్షలు ఖర్చయినట్లు మండప నిర్వాహకుడు అఖిల్ తెలిపారు.
వినూత్న విగ్రహాల ఏర్పాటుతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా నిర్వాహకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో రుద్రాక్షలతో వినాయకుడిని ఏర్పాటు చేయగా, గతేడాది 10,116 స్పటిక లింగాలను ఉపయోగించి మట్టి గణపతిని రూపొందించారు. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఏడాది జర్మన్ సిల్వర్ గణపతితో పాటు భక్తుల పూజల కోసం భారీ మట్టి వినాయక ప్రతిమను కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవాలు పూర్తయిన అనంతరం మట్టి గణపతిని జలాశయాల్లో నిమజ్జనం చేయకుండా మండపం ప్రాంగణంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. తద్వారా నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
అలాగే 11 అడుగుల గణపతిలో ఉపయోగించిన 2016 జర్మన్ సిల్వర్ వినాయక ప్రతిమలను ఉత్సవాల అనంతరం భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. భక్తి, కళాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతను మేళవించిన రామ్ లాల్ మండపం నిర్వాహకుల ప్రయత్నం సిరిసిల్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




