Yellareddypet: హరిదాస్‌నగర్‌లో నిఘా నీడ.. 8 సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సోమవారం ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 1:53 PM IST
Yellareddypet
X

Yellareddypet: హరిదాస్‌నగర్‌లో నిఘా నీడ.. 8 సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో నేరాల నియంత్రణ, గ్రామ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామ పంచాయతీ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

అనంతరం డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ.. కమ్యూనిటీ పోలీసింగ్, ‘నేను సైతం’ కార్యక్రమాల్లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో నిరంతరం కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

నేరాల నియంత్రణ, నేరాలకు పాల్పడిన నిందితులను త్వరగా గుర్తించడం, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా నేరాలను అరికట్టడంతో పాటు నిందితులపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.

గ్రామాల భద్రత ప్రజలందరి బాధ్యత అని పేర్కొన్న డీఎస్పీ.. పోలీసులకు ప్రజలు సహకరిస్తూ నేరరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, ఎస్‌ఐ రమేష్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ దేవానందం, వైస్ చైర్మన్ నంది కిషన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA