Sircilla: హోటళ్లు, మెకానిక్ షాపులపై సిరిసిల్ల పోలీసుల ఆకస్మిక దాడులు!

Sircilla: ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 20 రోజుల్లో 61 మంది బాల కార్మికులను రక్షించి, యజమానులపై 17 కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ చంద్రయ్య తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 20 July 2026 11:38 PM IST
Sircilla
X

Sircilla: హోటళ్లు, మెకానిక్ షాపులపై సిరిసిల్ల పోలీసుల ఆకస్మిక దాడులు!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పురోగతిపై సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ చంద్రయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో ఆపరేషన్ ముస్కాన్ బృందంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ.. జూలై 1 నుంచి జిల్లాలో పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల కార్మికులు, తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారికి రక్షణ కల్పించి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వద్దకు చేర్చే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

గడిచిన 20 రోజుల్లో జిల్లాలో మొత్తం 61 మంది పిల్లలను రెస్క్యూ చేసి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపరిచి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారికి అప్పగించినట్లు వెల్లడించారు. అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని పని చేయిస్తున్న వారిపై 17 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కావాలంటే పోలీసు శాఖతో పాటు లేబర్, విద్య, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు ఎస్పీ సూచించారు. ప్రతి తనిఖీని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డీసీఆర్‌బీ డీఎస్పీ భాస్కర్, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎస్‌ఐలు ప్రేమనందం, లాక్పతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story