Sircilla: యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే మేలు: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: సూపర్ ఎల్ నినో, నీటి కొరత దృష్ట్యా యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Oct 2026 7:39 PM IST
Sircilla
X

Sircilla: యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలే మేలు: కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల: సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని సమిష్టిగా అధిగమించేందుకు రైతులు ఈ యాసంగి సీజన్‌లో వరి సాగుకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

సూపర్ ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రణాళిక, రానున్న వాతావరణ పరిస్థితులు, నీటిపారుదల, పంటల సాగు తదితర అంశాలపై మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షపాతం, రానున్న మూడు నెలల వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, పంటల సాగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైందని, రానున్న మూడు నెలల్లో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు సూచిస్తున్నాయని తెలిపారు. ఎగువ మానేరు, మధ్య మానేరు, అన్నపూర్ణ, మల్కపేట రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు తాగునీరు, పశువుల అవసరాలకే వినియోగించాల్సి ఉందని స్పష్టం చేశారు.

ఒక ఎకరంలో వరి సాగుకు సుమారు 35 నుంచి 40 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని, అదే నీటితో ఐదు నుంచి ఆరు ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయవచ్చని వివరించారు. ప్రస్తుత వేడి వాతావరణం, తక్కువ వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇతర జిల్లాలతో పోలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ఈ యాసంగిలో వరి సాగు చేయకుండా పప్పుధాన్యాలు, ఆయిల్ పామ్, కూరగాయలు, మొక్కజొన్న, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ మేరకు ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆదేశించారు.

భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల బోర్లపై ఆధారపడే రైతులకు విద్యుత్ వినియోగం పెరిగి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. నీరు, విద్యుత్ లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి సాగుకు దూరంగా ఉండాలని రైతులకు సూచించారు.

నవంబర్ 30 వరకు ఖేత్ బచావో అభియాన్

జిల్లాలో నవంబర్ 30వ తేదీ వరకు ఆయా మండలాల్లో ఖేత్ బచావో అభియాన్‌తో పాటు సూపర్ ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులు ప్రతి మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాలకు హాజరై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి మట్టాలు, విద్యుత్ వ్యవస్థపై వివరించాలని సూచించారు.

నూతన బోర్లకు అనుమతి తప్పనిసరి

జిల్లాలో కొత్తగా బోర్లు వేయాలంటే సంబంధిత తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాల్టా చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఎవరూ బోర్లు వేయరాదని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రతి నల్లాకు ఆన్‌-ఆఫ్‌ బటన్ ఉండేలా చూడాలని, మిషన్ భగీరథ, మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు తమ పరిధిలో పర్యటించి నీటి వృథాను పర్యవేక్షించాలని సూచించారు. సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

పశుసంవర్ధక శాఖ అధికారులు పశువులకు అవసరమైన పశుగ్రాసం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గడ్డి సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.

తెలంగాణ జలసిరి పనులు ముమ్మరం చేయాలి

వీబీజీ రామ్ జీ పథకం కింద తెలంగాణ జలసిరి పనులను జిల్లాలో ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ పనుల ద్వారా నీటి సంరక్షణతో పాటు కూలీలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. పామ్ పాండ్లు, బోర్‌వెల్ రీఛార్జ్ గుంతలు, మ్యాజిక్ సోక్ పిట్లు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ప్రణాళిక ప్రకారం చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, మిషన్ భగీరథ ఎస్‌ఈ రాములు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA