Manthani: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం ఈనెల 10న చలో ఇందిరా పార్క్!

Manthani: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ‘చలో ఇందిరా పార్క్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

SHANKAR, MANTHANI
Published on: 7 Aug 2026 11:21 PM IST
Manthani
X

Manthani: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం ఈనెల 10న చలో ఇందిరా పార్క్!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పాత పెట్రోల్ బంకు సమీపంలో "చలో ఇందిరా పార్క్" పోస్టర్‌ను ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు పాస్టర్ తాళ్లపల్లి జాషువా ఆవిష్కరించారు.

దళిత క్రైస్తవులకు జరుగుతున్న చారిత్రాత్మక అన్యాయానికి వ్యతిరేకంగా ఈనెల 10న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరగనున్న "చలో ఇందిరా పార్క్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాస్టర్ తాళ్లపల్లి జాషువా మాట్లాడుతూ.. దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను హరించిన రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చిన ఆగస్టు 10వ తేదీన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ మహా నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.

ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గద్దపాటి విజయరాజు పాల్గొంటారని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు దశాబ్దాలుగా జరుగుతున్న వివక్షను తొలగించి, ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హోదా సాధనే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి దళిత క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి, తమ ఐక్యతను, ఉద్యమ స్ఫూర్తిని చాటాలని కోరారు.

ఈ మహా నిరసన సభను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు అంకరి కుమార్, పాస్టర్ గంగరాజు, పాస్టర్ ఎం రాజకుమార్, పాస్టర్ మచ్చ డేవిడ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story