Sircilla: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి!

Sircilla: జిల్లా కలెక్టరేట్ ను ఏఐఎస్ఎఫ్ నేతలు కుర్ర రాకేష్, మంద అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థుల స్కాలర్‌షిప్స్ బకాయిల విడుదల కోరుతూ ముట్టడించారు.

KALEEM, SIRICILLA
Published on: 23 July 2026 6:36 PM IST
Sircilla
X

Sircilla: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి!

సిరిసిల్ల: విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ (AISF) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా ఏఓ రాంరెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్, జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్లు 7, 8, 9ను రద్దు చేసి పాత విధానంలోనే స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని, విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై నియంత్రణ తీసుకురావాలని కోరారు.

విద్యాశాఖకు వెంటనే పూర్తి స్థాయి మంత్రిని నియమించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాయకులు, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా గర్ల్స్ కన్వీనర్ బర్రెంకల శ్రీహారిక, ఉపాధ్యక్షురాలు బోధసి ప్రవళిక, నాయకులు ఆంజనేయులు, ఎండీ ముదస్సిర్ షరీఫ్, ఎస్‌కే రెహాన్, ఆయాన్, వైభవ్, మనీష్, గౌతమి, మౌనికతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story