Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల పరిరక్షణకు అఖిలపక్షం ఏకీభావం!
Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అఖిలపక్ష సమావేశం.
Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల పరిరక్షణకు అఖిలపక్షం ఏకీభావం!
Yellareddypet: మండలానికి 2023లో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని ఎల్లారెడ్డిపేట ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. ఈ మేరకు ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ సమావేశ మందిరంలో స్థానిక సర్పంచ్ ఎలగందుల నరసింహులు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ టి. శంకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని కోరారు. కళాశాల ఎన్రోల్మెంట్ కోసం ప్రభుత్వానికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉందని, దాతలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఆ మొత్తాన్ని సమకూర్చి కళాశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం బీఏ, బీకాం కోర్సులను మంజూరు చేసిందని, ప్రస్తుతం బీఏలో 20 మంది, బీకాంలో 11 మంది విద్యార్థులు చేరినట్లు తెలిపారు. ముగ్గురు గెస్ట్ లెక్చరర్లు బోధిస్తున్నారని, మరో ముగ్గురిని ప్రభుత్వం త్వరలో నియమించనుందని వెల్లడించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల దోస్తు కోఆర్డినేటర్ శ్రీధర్ రావు మాట్లాడుతూ.. డిగ్రీ అర్హతతో ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నందున విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరాలని సూచించారు. కళాశాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కళాశాలను అభివృద్ధి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దోమ్మాటి నరసయ్య, సర్పంచ్ ఎలగందుల నరసింహులు, ఏబీవీపీ నాయకుడు రంజిత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. మంజూరైన డిగ్రీ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకుండా కాపాడుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన ఉన్న మహిళా సంఘం భవనం, రైతు వేదిక లేదా వృద్ధాశ్రమంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నాయకులను కలిసి కళాశాలను కాపాడుకునేందుకు సహకారం కోరాలని తీర్మానించారు.
దాతల సహకారంతో విద్యార్థులు, గెస్ట్ లెక్చరర్లకు అవసరమైన కుర్చీలు, బెంచీలు, ఫ్యాన్లు, కంప్యూటర్లు సమకూర్చేందుకు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. పంచాయతీ వార్డు సభ్యులు మూడు బీరువాలు, బండారి బాల్రెడ్డి ఒక ఫ్యాన్ అందించేందుకు అంగీకరించారు.
వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కలిసి గురువారం డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ షేక్ సభేరా బేగం, వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గిరిధర్ రెడ్డి, చెన్ని బాబు, బండారి బాల్రెడ్డి, నంది కిషన్, స్వంగ శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పందిలా శ్రీనివాస్ గౌడ్, బి.పేట రాజ్‌కుమార్, జావేద్, ఇలియాస్ బాబా తదితరులు పాల్గొన్నారు.




