Sircilla: మైసమ్మ గుట్టపై కంగారూ ఖడ్గమృగం పోలిన రాతి చిత్రాలు గుర్తింపు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లి గుట్టలపై కంగారూ, ఖడ్గమృగం పోలిన ప్రాచీన రాతి చిత్రాలను మట్టి ఫౌండేషన్ పరిశోధకులు గుర్తించారు.
Sircilla: మైసమ్మ గుట్టపై కంగారూ ఖడ్గమృగం పోలిన రాతి చిత్రాలు గుర్తింపు!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లి శివారులోని మైసమ్మ గుట్టపై కంగారూ, ఎకిడ్నా, ఖడ్గమృగం వంటి జంతువులను పోలిన ప్రాచీన రాతి చిత్రాలను మట్టి ఫౌండేషన్ బృందం గుర్తించింది. డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ చిత్రాలను వెలుగులోకి తీసుకువచ్చింది.
గుహలో ఎరుపు, ముదురు ఎరుపు రంగులతో చిత్రించిన కంగారూ, ఎకిడ్నా, ఖడ్గమృగం, తాబేలు, బల్లి, పాము, నక్షత్రాల ఆకృతులు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా, టాస్మేనియా ప్రాంతాల్లో మాత్రమే కనిపించే కంగారూను పోలిన చిత్రం లభించడం ఆసక్తికరంగా మారింది.
గుహ సమీపంలో పాత రాతియుగం, సూక్ష్మ రాతియుగానికి చెందిన పనిముట్లు, హెమటైట్ రంగు రాళ్లు, రాతిపై రాపిడి గుర్తులు కూడా లభించాయని తెలిపారు. వీటి ఆధారంగా ఈ చిత్రాలు మధ్య శిలాయుగం నుంచి నవీన శిలాయుగం కాలానికి చెందినవిగా ప్రాథమికంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
అయితే, ఇవి నిజంగా కంగారూ, ఎకిడ్నా చిత్రాలేననే విషయాన్ని శాస్త్రీయంగా పురావస్తు శాఖ నిర్ధారించాల్సి ఉందని రెడ్డి రత్నాకర్ రెడ్డి అన్నారు. ఈ చిత్రాలు మానవ వలసల చరిత్రపై కొత్త కోణాలను వెలుగులోకి తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో స్థానికులు పూజలు నిర్వహిస్తున్నందున రాతి చిత్రాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రభుత్వం మరియు పురావస్తు శాఖ తక్షణమే సంరక్షణ చర్యలు చేపట్టాలని మట్టి ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది.




