Peddapalli: హన్మంతునిపేట వైన్ షాప్‌పై ఉచిత మద్యం కోసం దాడి!

Peddapalli: పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలోని లక్ష్మీ గణపతి వైన్స్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

RAJU, PEDDAPALLI
Published on: 10 Aug 2026 11:35 PM IST
Peddapalli
X

Peddapalli: హన్మంతునిపేట వైన్ షాప్‌పై ఉచిత మద్యం కోసం దాడి!

పెద్దపల్లి: పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామం లోని లక్ష్మీ గణపతి వైన్స్‌లో ఈ నెల 8వ తేదీ శనివారం రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. సురభి కిరణ్‌రావు, శ్రీనివాస్‌రావు, పోలసాని సుధాకర్‌రావు అనే ముగ్గురు వ్యక్తులు వైన్‌షాప్‌లోకి బలవంతంగా ప్రవేశించారు.

మద్యం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. షాప్ నిర్వాహకుడు విద్యాసాగర్ మరియు సిబ్బంది దానికి నిరాకరించడంతో... పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నిందితులు అసభ్యంగా దూషించడమే కాదు, హత్య చేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా షాప్ గ్రిల్‌ను పగలగొట్టి, లోపలికి చొరబడ్డారు. కౌంటర్‌లో ఉన్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. సీలింగ్ ఫ్యాన్ రెక్కలు కూడా విరగ్గొట్టారు.

ఈ దాడిలో షాప్‌కు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. నిందితుల బెదిరింపులతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వైన్‌షాప్ నిర్వాహకుడు విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కిరణ్‌రావు ఇదే తరహాలో ఇబ్బంది పెట్టాడని, కానీ ఈసారి ప్రాణహాని స్థాయిలో బెదిరించడంతో ఫిర్యాదు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని, వాటిని పోలీసులకు అందజేస్తామని విద్యాసాగర్ చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఉచితంగా మద్యం ఇవ్వలేదనే చిన్న కారణానికి ఇంతటి దౌర్జన్యానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story