Manthani: చెరువు మట్టి అక్రమ వెంచర్లకు తరలింపు సీజ్ చేయాలని డిమాండ్!
Manthani: చారిత్రాత్మక అయ్యగారి చెరువు సుందరీకరణ మట్టిని అక్రమంగా ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం, డీవైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు.
Manthani: చెరువు మట్టి అక్రమ వెంచర్లకు తరలింపు సీజ్ చేయాలని డిమాండ్!
Manthani: రాజుల సొమ్ము రాళ్ల పాలైన చందంగా మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ నేతలు ఆరోపించారు. సుందరీకరణ పనుల పేరుతో తీసిన మట్టిని కొందరు మాఫీయాదారులు జేసిబీలతో తవ్వి, ట్రాక్టర్లలో రెడ్డిగారి అక్రమ వెంచర్‌లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని వారు మండిపడ్డారు.
ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ లు బుధవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కావాలనే పట్టించుకోవడం లేదని విమర్శించారు. చెరువు సుందరీకరణ పనుల అనంతరం మిగిలిన మట్టిని ప్రధాన రహదారి గుండా వందలాది ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ లక్షలాది రూపాయలు జేబులు నింపుకుంటున్నారని తెలిపారు. సామాన్య రైతులు వ్యవసాయ అవసరాల కోసం మట్టి కావాలని రెవెన్యూ అధికారులకు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని, అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్‌లకు మాత్రం అనుమతిస్తున్నారని వారు అన్నారు. "తట్టెడు మట్టి తీయనివ్వని అధికారులు, వందల ట్రాక్టర్లతో జరుగుతున్న అక్రమ తరలింపును మాత్రం ఎందుకు ఆపడం లేదు?" అని ప్రశ్నించారు.
నిబంధనలు ఉల్లంఘించి వ్యవసాయ భూమి పేరిట అక్రమ వెంచర్‌లో డంప్ చేసిన మట్టి కుప్పలను వెంటనే అధికారులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సీజ్ చేసిన మట్టిని వేలం వేయకుండా, పేద రైతుల వ్యవసాయ పొలాలకు ఉచితంగా అందించాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బూడిద గణేష్, గొర్రెంకల సురేష్ హెచ్చరించారు.




