Karimnagar: చొప్పదండిలో రూ.50 కోట్లతో డబుల్ రోడ్డు.. శంకుస్థాపన చేసిన బండి సంజయ్
Karimnagar: చొప్పదండి - మల్యాల మధ్య రూ.50 కోట్లతో డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన. కలిసి పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
Karimnagar: చొప్పదండిలో రూ.50 కోట్లతో డబుల్ రోడ్డు.. శంకుస్థాపన చేసిన బండి సంజయ్
కరీంనగర్ జిల్లా: చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామం నుండి జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్డు వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రూ.50 కోట్ల నిధులతో చేపడుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించినట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే నియోజకవర్గ అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. గతంలో కూడా చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి పలు నిధులు తీసుకువచ్చామని, ప్రస్తుతం 35 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం కోసం సీఆర్‌పీ నిధుల ద్వారా రూ.50 కోట్లు కేటాయించామని తెలిపారు.
ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రవాణా సౌకర్యాలు ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇప్పటివరకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అందులో రూ.7 వేల కోట్ల నిధులు కేవలం రహదారుల అభివృద్ధికే కేటాయించినట్లు చెప్పారు.
రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే ఉండాలని, అభివృద్ధి విషయంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తే ప్రజలు హర్షిస్తారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయితే చొప్పదండి, జగిత్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కలగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




