Karimnagar: మోదీ పాలన 12 ఏళ్లు: కరీంనగర్‌లో బీజేపీ వినూత్న కార్యక్రమాలు!

Karimnagar: స్కూళ్లను శుభ్రం చేయండి.. సైకిళ్లను గెలుచుకోండి! మోదీ పాలన 12 ఏళ్ల సందర్భంగా బండి సంజయ్ సరికొత్త ప్లాన్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 Jun 2026 10:21 AM IST
Karimnagar
X

Karimnagar: మోదీ పాలన 12 ఏళ్లు: కరీంనగర్‌లో బీజేపీ వినూత్న కార్యక్రమాలు!

కరీంనగర్ : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘‘స్వచ్చ పాఠశాల’’ పేరుతో తన పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజవర్గాల్లోని అన్ని గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలన్నింటిన్నీ పరిశుభ్రం చేయాలని నిర్ణయించారు. ‘‘స్వచ్ఛ పాఠశాల’’ పేరుతో ఈనెల 13న ఆయా పాఠశాలలన్నింటినీ పరిశుభ్రం చేయాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ లోని చైతన్యపురిలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. మోదీ 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈనెల 15నుండి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ పరిశుభ్రం చేసి సుందరంగా ముస్తాబు చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గంలో మండలాల వారీగా పార్టీ కార్యకర్తలంతా సమావేశమై ఒక్కో పాఠశాల వారీగా ఇంచార్జీలను నియమించాలని సూచించారు.

ఈనెల 11, 12 తేదీల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ‘‘టిఫిన్ బైఠక్’’ పేరుతో సమావేశం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రతి స్కూల్ లోని ఎన్ని తరగతి గదులుంటాయో, ఒక్కో గదికి ఇద్దరు చొప్పున కార్యకర్తలను కేటాయించాలి. ఈనెల 13న అన్ని పాఠశాలల్లోని అన్ని తరగతి గదులను శుభ్రం చేయించాలి. అవసరమైతే చీపురు, క్లాత్ వంటి వస్తువులను తీసుకెళ్లాలి. క్లాస్ రూంలను శుభ్రం చేయడంతోపాటు ఆయా పాఠశాలలను సుందరంగా ముస్తాబు చేయాలి. స్కూల్ ను క్లీన్ చేయడం ద్వారా ఒక మంచి వాతావరణం కల్పించాలి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రాం వంటి సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం నిర్వహించాలి‘‘ అని కోరారు. దీంతోపాటు ఈనెల ప్రతి గ్రామంలో ‘‘మీ పిల్లలను పాఠశాలల్లో చేర్చించండి’’ అనే నినాదంతో ఊరూవాడా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీనిపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో ఉచితంగా బ్రాండెడ్ సైకిల్ ను అందజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ‘‘ఇదే విషయాన్ని ఊరూవాడా చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే ప్రతి ఒక్కరికి ఉచితంగా బ్రాండెడ్ సైకిల్ అందిస్తామని చెప్పండి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి రికార్డు స్థాయిలో ఒకేసారి ఒకే టైంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులందరికీ సైకిళ్లను పంపిణీ చేద్దాం. అవసరమైతే గిన్నిస్ బుక్ రికార్డులో నమోదయ్యేలా క్రుషి చేద్దాం. తద్వారా ప్రజల్లోకి మంచి సందేశాన్ని పంపుతాం.’’అని పేర్కొన్నారు.

మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు

మరోవైపు 12 ఏళ్ల మోదీ పాలనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story