Karimnagar: ఆటోపై హిందుత్వ నినాదం.. యువకుడిపై దాడి.. బండి సంజయ్ భరోసా
Karimnagar: హైదరాబాద్ మెహిదీపట్నంలో ఆటోపై హిందుత్వ నినాదాలు రాసుకున్నందుకు ఒక యువకుడిపై జరిగిన దాడి కలకలం రేపింది.
Karimnagar: ఆటోపై హిందుత్వ నినాదం.. యువకుడిపై దాడి.. బండి సంజయ్ భరోసా
కరీంనగర్: ఆటో పై హిందుత్వ నినాదాన్ని రాసుకోవడమే అతను చేసిన పాపం. బండ బూతులు తిడుతూ ఆటో కవర్ ను చించేయడమే కాకుండా పోలీసు అండతో భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో ఆలస్యంగా వెలుగు చేసింది. వివరాల్లోకి వెళితే, వనపర్తి జిల్లాకు చెందిన చంచరి భరత్ కుమార్(24) పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చి ఆటో నడుపుతున్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయారు.
నెలలో 15 రోజులు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హైదరాబాద్ లో ఇల్లు లేకపోవడంతో ఆటో నడిపినన్ని రోజులు హైదరాబాద్ లోనే ఎక్కడో ఒక దగ్గర ఫుట్ పాత్ పైన, బస్టాండ్ వద్ద పడుకోవడం, తెల్లవారుజామున సులభ్ కాంప్లెక్స్ కు వెళ్లి స్నానపానాదులు పూర్తి చేసుకుని మళ్లీ ఆటోనడపడం, ఆ వచ్చిన డబ్బుతో ఊరికి వెళ్లి కుటుంబంతో జీవనం కొనసాగించడం భరత్ కు నిత్యక్రుత్యమైంది.
భరత్ హిందుత్వ వాది. అందుకే ఆటో వెనుక కవర్ పై ‘‘Changing your religion is like your father (నీ మతాన్ని మార్చుకోవడం అంటే నీ తండ్రిని మార్చుకోవడం లాంటిది), Anyone born on this earth is a hindu… jai Sriram (ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే… జై శ్రీరామ్) అని నినాదాన్ని రాయించుకున్నారు.
అయితే ఈనెల 13న భరత్ ప్యాసింజర్ ను ఎక్కించుకుని మెహిదీపట్నం నుండి జీడిమెట్లకు వెళుతుండగా మజ్లిస్ పార్టీకి చెందిన నలుగురు యువకులు ఆటోను వెంబడించారు. పిల్లర్ నెంబర్ 131 వద్ద అడ్డగించారు. బలవంతంగా భరత్ ను ఆటో నుండి దింపి.. ‘ఆటో వెనుక ఏం రాసినవ్ రా... ఏమనుకుంటున్నవ్ రా...ఆ స్లోగన్స్ తీసేస్తావా? లేదా?’’ అంటూ బండ బూతులు తిట్టడం ఆరంభించారు. నా ఆటో, నా ఇష్టం.
నేను రాసిన దాంట్లో తప్పేముంది? అని అడిగితే... రాయలేని భాషలో పచ్చి బూతులు తిడుతూ ఆటో కవర్ వెనుకనున్న నినాదాలను గీకేశారు. ఆటో కవర్ ను చించి వేశారు. మళ్లీ అట్లాంటి నినాదాలు రాస్తే... హైదరాబాద్ లో ఆటో కూడా తిరగనీయబోమని, చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. మళ్లీ కాసేపటికే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. ‘‘నేను అత్తాపూర్ ఎస్ఐని(పేరు శ్రీనివాసులు) మాట్లాడుతున్నా. ఆటోమీద అట్లాంటి స్లోగన్స్ ఎట్లా రాస్తావ్? హైదరాబాద్ లో ఆటో తిరగాలని ఉందా? లేదా? వెంటనే స్టేషన్ కు రా. నీమీద కంప్లయింట్ వచ్చింది. రాకపోతే నీ ఆటోను సీజ్ చేస్తా’’అంటూ బెదిరించారు.
దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయిన భరత్ కు అక్కడున్న కొందరు హిందుత్వ వాదుల వద్దకు తీసుకెళ్లారు. విషయం విన్న వాళ్లు భరత్ కు అండగా నిలిచారు. అత్తాపూర్ పీఎస్ కు తీసుకెళ్లి స్థానిక సీఐకి జరిగిందంతా వివరించారు. ఎస్ఐ శ్రీనివాసులుపై చర్య తీసుకోవడంతోపాటు భరత్ ను బెదరించి ఆటో ను డ్యామేజ్ చేసిన మజ్లిస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చారు.
అట్లాగే భరత్ ను వెంట బెట్టుకుని ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిశారు. జరిగిన విషయాన్ని వివరిస్తూ ఫోటోలు, వీడియోలు చూపించారు. భరత్ ద్వారా తెలుసుకున్న కేంద్ర మంత్రి ‘‘బాధపడొద్దు. నేను అండగా ఉంటా’’అని భరోసా ఇచ్చారు. హిందుత్వ సిద్దాంతాన్ని నమ్మి ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నందుకు అభినందించారు.
ఆటో కవర్ డ్యామేజ్ అయిందని భరత్ చెప్పడంతో పాత ఆటో స్థానంలో కొత్త ఆటో తీసుకోవాలని, అందుకయ్యే ఖర్చును తాను చెల్లిస్తానని హామీ ఇవ్వడంతోపాటు వెంటనే కొత్త ఆటో కొనిచ్చి అందుకయ్యే డబ్బు ఇవ్వాలని అక్కడే ఉన్న సిబ్బందిని ఆదేశించారు. భరత్ ను వేధించిన మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకునే అంశంపై హైదరాబాద్ సీపీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.




