Sircilla: మోదీ సభకు ‘సిరిసిల్ల’ నుండి జన సునామీ రావాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు.. సభ ఏర్పాట్లపై భారీ సమీక్ష!
Sircilla: ఈనెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్ సభకు సిరిసిల్ల జిల్లా నుండి భారీగా ప్రజలను తరలించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. అలాగే 12న జరిగే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Sircilla: మోదీ సభకు ‘సిరిసిల్ల’ నుండి జన సునామీ రావాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు.. సభ ఏర్పాట్లపై భారీ సమీక్ష!
సిరిసిల్ల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు సిరిసిల్ల జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఒక్క కరీంనగర్ జిల్లా నుండే 800 కార్లు 200 బస్సుల్లో జన సమీకరణ చేస్తున్నారని, సిరిసిల్ల జిల్లా నుండి సైతం అంతకు మించి సమీకరించాలని కోరారు. మండలాలు, గ్రామాల వారీగా స్వచ్ఛందంగా ప్రజలు మోదీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని వారికి తగిన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు ఉదయం సిరిసిల్ల పట్టణంలో జిల్లా అధ్యక్షలు రెడ్డబోయిన గోపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి భారీ ఎత్తున బీజేపీ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని సభకు జన సమీకరణపై ఆయా నేతలతో బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే.
ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. 3వ సారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త స్వచ్ఛందంగా తరలిరావాలి. కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో జన సమీకరణ చేద్దాం. వేలాది సంఖ్యలో ప్రజలను పరేడ్ మైదానానికి తరలిద్దాం. బీజేపీ నాయకులంతా తమ అనుచరులు, టీంతో తప్పనిసరిగా పరేడ్ మైదానానికి తరలి రావాలి. ప్రతి ఒక్కరూ మోదీ సభకు ఆహ్వానిస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలి. మీ గ్రామాలు, వార్డులు, మండలాల పరిధిలో వాల్ రైటింగ్ రాయించండి. సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి తగిన రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలి. మోదీ సభ సక్సెస్ తో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం తథ్యమనే సంకేతాలు పంపుదాం. అట్లాగే ఈనెల 12న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రకు సైతం జిల్లా నుండి భారీ ఎత్తున హిందువులంతా హాజరయ్యేలా చూడాలని కోరారు.




