Karimnagar: హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ సెగ.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ హెచ్చరిక!
Karimnagar: హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక.
Karimnagar: హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ సెగ.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ హెచ్చరిక!
కరీంనగర్: హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్ నేతలెవరినీ రోడ్లపై తిరగనీయబోం. అడుగుడుగునా అడ్డుకుంటాం. హుజూరాబాద్ లోని చెత్త కుప్పలను, చచ్చిపోయిన కుక్కలను, జంతువులను కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందర వేస్తాం. ఆ వాసన ఎంత భయంకరంగా ఉంటుందో అర్ధమయ్యేలా చేస్తాం.’’అని అల్టిమేటం జారీ చేశారు.
హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల, పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ప్రజా ఆందోళన’’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ
జాతీయ రహదారి పక్కన డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం దుర్మార్గం. చుట్టుపక్కలనున్న గ్రామాల పరిస్థితి ఏమిటి? హుజూరాబాద్ మున్సిపాలిటీ శివారులో డంపింగ్ యార్డును పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వెంటనే మొట్ట మొదట వ్యతిరేకించిన వ్యక్తిని నేను. హుజూరాబాద్ లో పొరపాటున యార్డు ఏర్పాటైతే ఇక్కడి యువతకు పిల్లను ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అనేక రోగాలొస్తాయి. మంచి నీళ్లు కూడా కాలుష్యమవుతాయి. ఇక్కడి ప్రజలు నిద్ర కూడా పోలేని దుస్థితి ఉంది. అందుకే డంపింగ్ యార్డును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకోసం బీజేపీ పక్షాన పోరాటాలను ఉధ్రుతం చేస్తాం. లాఠీలు, కేసులకు, జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోం. హుజూరాబాద్ ఫ్రజల ప్రాణాలను కాపాడేందుకు మా ప్రాణాలను అడ్డుగా పెడతాం.
ఒకవైపు ప్రజా పోరాటాలతోపాటు మరోవైపు న్యాయ పోరాటానికి సిధ్దమవుతున్నాయి. దీంతోపాటు మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల ను సైతం ఆశ్రయిస్తాం. అతి త్వరలో రాష్ట్ర గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేస్తాం. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ప్రజల అరణ్య రోదన వినబడటం లేదా? ఆయనను అధికారులు తప్పుదోవ పట్టించారా? కాంగ్రెస్ తోపాటు బీఆర్ఎస్, బీజేపీసహా అఖిలపక్ష పార్టీలు, ప్రజలు డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ నెల రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా పట్టింపు లేదా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. హుజూరాబాద్ ప్రజలకు నేను చేసే విజ్ఝప్తి ఒక్కటే. బీజేపీ చిత్తశుద్ధితో ఉద్యమిస్తుంది. మా పోరాటాల్లో చిత్తశుద్ధి, నిజాయితీ ఉంది. హుజూరాబాద్ ప్రజలు, సంఘాల నేతలంతా బీజేపీ చేసే పోరాటాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నా.




