Vemulawada: భీమేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన వరుణయాగ మహోత్సవాలు!
Vemulawada: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సకాలంలో వర్షాలు కురవాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 3 రోజుల వరుణయాగం పూర్ణాహుతితో ముగిసింది.
Vemulawada: భీమేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన వరుణయాగ మహోత్సవాలు!
వేములవాడ, ఆగస్టు 1: రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ నిర్వహించిన మూడు రోజుల వరుణయాగ మహోత్సవాలు శనివారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నిర్ణయం మేరకు, దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలనుసారం రాష్ట్రంలో నెలకొన్న అనావృష్టి పరిస్థితులు తొలగి, ప్రజలు సుఖశాంతులతో, పంటలు సమృద్ధిగా పండేలా, సకాలంలో వర్షాలు కురవాలని సంకల్పించి ఈ మహాయాగాన్ని జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు మూడు రోజుల పాటు నిర్వహించారు.
మహోత్సవాల్లో భాగంగా ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠ, దేవతా పూజలు, గౌరీ పూజ, విశ్వశాంతి కార్యక్రమాలు, వాస్తు హోమం, నవగ్రహ హోమం, పరివార దేవతా హోమం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, ఇంద్రాది దేవతల జపాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అదేవిధంగా ప్రధాన దేవత శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం వరుణ పర్జన్య దీపారాధనతో పాటు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
మహోత్సవాల చివరి రోజు శనివారం ఉదయం మూలమంత్ర హోమం, ఇతర వైదిక క్రతువులు నిర్వహించి ఉదయం 10.30 గంటల నుండి 11.00 గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారికి మహామంగళహారతి సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి మాట్లాడుతూ, భగవంతుని అనుగ్రహంతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, వ్యవసాయం సమృద్ధిగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జయకుమారి,పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.




