Jagtial: బయోమెడికల్ చెత్త రచ్చ: మోతె డౌన్ వద్ద ప్రమాదకర వ్యర్థాలు!
Jagtial: జగిత్యాల బైపాస్ రోడ్డు మోతె డౌన్ కెనాల్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా బయోమెడికల్ వ్యర్థాలను పడేశారు.
Jagtial: బయోమెడికల్ చెత్త రచ్చ: మోతె డౌన్ వద్ద ప్రమాదకర వ్యర్థాలు!
జగిత్యాల: పట్టణంలో హాస్పిటల్ వ్యర్థాల సక్రమ నిర్వహణపై నిర్లక్ష్యం మరోసారి స్పష్టమైంది. జగిత్యాల బైపాస్ రోడ్డులోని మోతె డౌన్ చౌరస్తా సమీపంలో ఉన్న కెనాల్‌పై ప్రమాదకర బయోమెడికల్ వ్యర్థాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హెచ్చరిక బోర్డు ఉన్నా కేర్‌లెస్!
"ఇక్కడ చెత్త వేస్తే రూ. 5,000 జరిమానా విధించబడును" అని మున్సిపల్ అధికారులు నేరుగా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే, ఆ బోర్డు ముందే సాధారణ వ్యర్థాలు కాకుండా, స్పష్టంగా 'బయో హజార్డ్ (Bio Hazard)', 'ఇన్ఫెక్షియస్ (Infectious)' అని ముద్రించి ఉన్న హాస్పిటల్ వ్యర్థాలను నిర్భయంగా పడేయడం అధికారుల పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోంది.
స్థానికుల తీవ్ర ఆగ్రహం
నిబంధనల ప్రకారం ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల వ్యర్థాలను ప్రత్యేక వాహనాల్లో సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ప్రమాదకర చెత్తను కెనాల్‌పై, రోడ్డు పక్కన వేయడం వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు మండిపడుతున్నారు.
వెంటనే మున్సిపల్, కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు స్పందించి, బాధ్యులైన హాస్పిటళ్లు లేదా ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




