Karimnagar: కరీంనగర్‌లో 'హిందూ ఏక్తా యాత్ర' సందడి
Karimnagar: మే 12న కరీంనగర్‌లో జరగనున్న హనుమాన్ జయంతి 'హిందూ ఏక్తా యాత్ర' కోసం బీజేపీ శ్రేణుల భారీ ఏర్పాట్లు.
Karimnagar: కరీంనగర్‌లో 'హిందూ ఏక్తా యాత్ర' సందడి
కరీంనగర్: హనుమాన్ జయంతి ( మే 12 ) సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ ఏక్తాయాత్రను బిజెపి శ్రేణులు సిద్ధం కావాలని, యాత్రను సక్సెస్ చేయాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లో బిజెపి ముఖ్య నేతలతో హిందూ ఏక్తాయాత్ర సన్నాక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కరీంనగర్లో ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుందన్నారు. హిందువుల సంఘటత శక్తిని చాటేందుకు , లక్షలాదిమందితో జరిగే ఈ యాత్రకు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చిందని తెలిపారు.
కరీంనగర్లో జరిగే భారీ ఆధ్యాత్మిక కార్యక్రమంగా హిందూ ఎక్తాయాత్ర కు ఖ్యాతి గుర్తింపు లభించిందన్నారు. గత 12 ఏళ్లుగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కరీంనగర్ నగరాన్ని కాషాయమంగా మార్చుతూ , ప్రతి ఏటా ఎంతో ఘనంగా , వైభవంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ నిర్వహిస్తున్నారని తెలిపారు. వైశ్య భవన్ నుండి ప్రారంభమై కరీంనగర్లోని ప్రధాన కూడళ్ల మీదుగా కొనసాగే ఈ యాత్ర అశేష హిందూ బంధువుల, వివిధ హిందూ సంఘాల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఆ దిశలోనే బిజెపి శ్రేణులు సైతం హిందూ ఏక్తా యాత్ర ను విజయవంతం చేయడానికి తగిన కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మేయర్ కొలగని శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ రావు , కార్పొరేటర్ లు , నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.




