Illanthakunta: ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మానుకోవాలి: బీజేపీ!
Illanthakunta: ఓట్ చోరీ పేరుతో రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను మానుకోవాలని ఇల్లంతకుంట బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
Illanthakunta: ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మానుకోవాలి: బీజేపీ!
ఇల్లంతకుంట: ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని మానుకోవాలని బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందు ఉంచాలని అన్నారు.
ఇల్లంతకుంటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, భారత ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పించడం, ఓటర్ జాబితాలోని తప్పులను సరిదిద్దడం ఎన్నికల ప్రక్రియలో కీలకమని తెలిపారు. SIR ప్రక్రియ ఓటర్ జాబితాలను మరింత పారదర్శకంగా, ప్రక్షాళన చేసే దిశగా చేపట్టే చర్య అని వివరించారు.
SIR ప్రక్రియపై సుప్రీంకోర్టు 2026 మే 27న ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు నిర్దిష్టమైన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను, కాంగ్రెస్ పార్టీకి తగ్గుతున్న ప్రజాదరణను తట్టుకోలేక రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
గతంలో ఓటర్ జాబితాల అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. నేడు ఇతరులపై ఓట్ చోరీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో అపోహలు సృష్టించకుండా, తమ ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని హితవు పలికారు. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం పనితీరుపై ఆరోపణలు చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కారం కోరాలని పేర్కొన్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాలు, 2019లో 303 స్థానాలు గెలుచుకుందని, 2024 ఎన్నికల్లో 240 స్థానాలకు పరిమితమైందని అనిల్ కుమార్ గుర్తుచేశారు. 2024లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోయినా ప్రజాతీర్పును గౌరవిస్తూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజల తీర్పే అంతిమమని, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తూ ప్రజాతీర్పును ప్రశ్నించడం సరికాదని అన్నారు.
తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ ప్రజాతీర్పుగా అంగీకరించదా అని ప్రశ్నించారు. బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా పోరాడి, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని సూచించారు. నిరసనల పేరుతో అశాంతి సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయకూడదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బత్తిని సాయ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు దేశెట్టి శ్రీనివాస్, నాగ సముద్రాల సంతోష్, అసెంబ్లీ కో-కన్వీనర్ బత్తిని స్వామి, మండల ప్రధాన కార్యదర్శి కరికె నవీన్, మండల ఉపాధ్యక్షులు చింతలపల్లి తిరుపతిరెడ్డి, మండల కార్యదర్శి లొంకోజు చంద్రం, ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, మండల కోశాధికారి పిల్లి గోపాల్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కొమ్ము హరికృష్ణ, మండల కార్యవర్గ సభ్యులు పయ్యావుల బాలయ్య, గూడెల్లి భాస్కర్, చదవాల శ్రీధర్, గడ్డం కొండల్ రెడ్డి, పలుమారి రవి, చిట్యాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసరి శ్రీనివాస్, గజగోని శంకర్రావు, సదువాల రవి, పొన్నం కృష్ణ, చొప్పరి వంశీ తదితరులు పాల్గొన్నారు.




