Karimnagar: రవీందర్ సింగ్ రాజకీయ అజ్ఞాని: బీజేపీ నేత బోయినపల్లి ప్రవీణ్ రావు
Karimnagar: కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రి బండి సంజయ్ తెచ్చిన నిధుల లెక్కలు చెప్పేందుకు సిద్ధమని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు స్పష్టం చేశారు.
Karimnagar: రవీందర్ సింగ్ రాజకీయ అజ్ఞాని: బీజేపీ నేత బోయినపల్లి ప్రవీణ్ రావు
కరీంనగర్: కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా తేవలేదంటూ మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి, దివాలాకోరుతనానికి నిదర్శనమని, బి ఆర్ ఎస్ పార్టీకి ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చిన ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మండిపడ్డారు.
సోమవారం పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రవీందర్ సింగ్ విసిరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, బండి సంజయ్ కృషితోనే కరీంనగర్‌కు వేల కోట్ల నిధులు వచ్చాయని లెక్కలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. రవీందర్ సింగ్ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని , బండి సంజయ్ కుమార్ తీసుకువచ్చిన నిధుల విషయం తేలిన తర్వాత రవీందర్ సింగ్ రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బల్దియాను ఉద్ధరించిందేమీ లేకపోవడంతోనే నగర ప్రజలు ఆ పార్టీని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేశారని ప్రవీణ్ రావు ఎద్దేవా చేశారు.
ప్రజలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, బీజేపీపై ఉన్న విశ్వాసంతోనే నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగిరిందని తెలిపారు. మేయర్ కోలగాని శ్రీనివాస్ పై రవీందర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. మేయర్ కోలగాని శ్రీనివాస్ అధికారంలోకి ఆరు నెలల లోపే ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని తెలిపారు.
గతంలో పదేళ్లు అధికారంలో ఉండి కార్పొరేషన్ లో అభివృద్ధిని నిర్వీర్యం చేసి ఇప్పుడు మేయర్ పై అనవసరమైన వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలన్నారు. రవీందర్ సింగ్ సవాల్‌ను స్వీకరిస్తూ, బండి సంజయ్ ద్వారా కేంద్రం నుంచి తెచ్చిన నిధుల వివరాలను ప్రవీణ్ రావు మీడియా ముందుంచారు:
స్మార్ట్ సిటీ & అర్బన్ ఛాలెంజ్ ఫండ్: కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ నిధులు ఎంపీ బండి సంజయ్ కృషితోనే వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు జమ చేయలేక చేతులెత్తేసింది. అయినా అభివృద్ధి ఆగిపోకూడదనే ఉద్దేశంతో కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకువచ్చిన ఘనత బండి సంజయ్‌దే. ప్రస్తుతం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర నిధులను నగరపాలక సంస్థకు తెచ్చింది ఎవరనేది రవీందర్ సింగ్‌కు తెలియదా అని ప్రశ్నించారు.
ఎంపీలాండ్స్ నిధులు: ఎంపీ లాండ్స్ నిధులతో కరీంనగర్‌లో లెక్కలేనన్ని బోర్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ. 17 కోట్లు ఖర్చు చేశారు.
సీఎస్‌ఆర్ (CSR) సేవలు: ఎంపీ లాండ్స్ నిధులతో పాటు సీఎస్‌ఆర్ ఫండ్ ద్వారా భారీగా నిధులు సాధించి ప్రజలకు సేవ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న దాదాపు 20,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వాసుపత్రులకు రూ. కోటికి పైగా నిధులతో వైద్య సామాగ్రి, ఉచిత అంబులెన్సులు అందజేశారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వ ఆసుపత్రికి సేవలు అందించడమే కాకుండా, మహిళల కోసం సీఆర్ఎఫ్ ఫండ్ కింద ఎలక్ట్రిక్ ఆటోలు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
నేషనల్ హైవే & రైల్వే అభివృద్ధి: కరీంనగర్ - వరంగల్ నేషనల్ హైవే కోసం దాదాపు రూ. 4,500 కోట్లు తీసుకొచ్చి పనులు పూర్తి చేయించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను 'అమృత్ భారత్' కింద ఆధునీకరించడానికి దాదాపు రూ. 50 కోట్లు మంజూరు చేయించారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్ఓబి (ROB) నిర్మాణం తమవల్ల కాదంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులెత్తేస్తే, 'సేతు బంధు' పథకం కింద కేంద్ర నిధులతో దాదాపు రూ. 150 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు.
గ్రామీణ అభివృద్ధి: పార్లమెంట్ పరిధిలో ప్రతి సంవత్సరం ఈజీఎస్ (EGS) నిధులతో గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు; కేంద్ర పథకాల నిధులతో మండలాల్లో కొత్త రోడ్లు, రెండు వరుసల రోడ్ల కోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించారు.
ఇంకా లెక్కలేనన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను రవీందర్ సింగ్ కు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.బండి సంజయ్ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటానని రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉండాలని ప్రవీణ్ రావు డిమాండ్ చేశారు. దమ్ముంటే ఈ అంశంపై చర్చకు వేదిక, తేదీని రవీందర్ సింగ్ ప్రకటించాలని సవాల్ విసిరారు.
లేనియెడల, నిరాధార ఆరోపణలు చేసినందుకు నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బండారి వేణు, బండ రమణారెడ్డి, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, గాజ రమ శివరాం, కర్రె పద్మ అనిల్, కొలిపాక శ్రీనివాస్ దేవసాని సరస్వతి సత్యనారాయణ, జాడి బాల్రెడ్డి, తోట అనిల్, వంగల రవి గోపాల్, కేఏ పీపీ చంద్ర, అప్పాల శ్రీనివాస్, దయ్యాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.




