Sircilla: రాహుల్ గాంధీ చిత్రపటానికి నిప్పంటించిన కాషాయ శ్రేణులు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఢిల్లీ కాంగ్రెస్ ఆందోళనలను ఖండిస్తూ రాహుల్ గాంధీ చిత్రపటాన్ని తగులబెట్టి బీజేపీ శ్రేణులు భారీ నిరసన నిర్వహించాయి.

KALEEM, SIRICILLA
Published on: 22 July 2026 9:00 PM IST
Sircilla
X

Sircilla: రాహుల్ గాంధీ చిత్రపటానికి నిప్పంటించిన కాషాయ శ్రేణులు!

సిరిసిల్ల: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలను ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ చిత్రపటానికి నిప్పంటించి తమ నిరసనను కొనసాగించారు.

జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ, పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలను పక్కనపెట్టి రాహుల్ గాంధీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుల ఇళ్లపై దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story