Sircilla: సిరిసిల్లలో ఘనంగా బీజేపీ సేవా జ్యోతి యాత్ర.. వికసిత్ భారత్ సభ!
Sircilla: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర ఘనంగా నిర్వహించారు.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా బీజేపీ సేవా జ్యోతి యాత్ర.. వికసిత్ భారత్ సభ!
సిరిసిల్ల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *“సేవా సంకల్ప్ అభియాన్”*లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు.
బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద అమరవీరుల స్థూపం సమీపంలో కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ గంగాడి మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు.
అనంతరం సేవా జ్యోతి యాత్రను ప్రారంభించారు. రథంపై జ్యోతిని వెలిగించగా, నేత కార్మికుడు వెల్ది హరి ప్రసాద్ కాగడాను వెలిగించి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అందజేశారు. అనంతరం పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు జెండాలు చేతబట్టి ర్యాలీగా తరలివెళ్లారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. మోదీ ప్రజా జీవితం దేశ సేవ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో కొనసాగుతోందన్నారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్లి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా బీజేపీ కార్యకర్తలు ప్రజా సేవకు ప్రాధాన్యత ఇస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సేవా భావాన్ని ప్రజల్లో మరింత విస్తరించాలని అన్నారు. సేవా జ్యోతి యాత్ర ప్రజల్లో సేవ, సమాజ హితం, దేశాభివృద్ధిపై చైతన్యం కలిగించేలా ఉండాలని ఆకాంక్షించారు.
జిల్లా ఇన్‌చార్జ్ గంగాడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సేవా ప్రస్థానం బీజేపీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. సేవా సంకల్ప్ అభియాన్‌ను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువమోర్చా, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




