Manthani: కూరగాయల మార్కెట్ వ్యాపారులకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలి!
Manthani: మంథనిలో కూరగాయల మార్కెట్ కూల్చివేతతో ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ వసతులు కల్పించాలని డిమాండ్ చేసిన బీఆర్‌ఎస్ నాయకులు.
Manthani: కూరగాయల మార్కెట్ వ్యాపారులకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలి!
Manthani: అభివృద్ధి పనుల పేరుతో పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ ప్రజలు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగించవద్దని బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ను కూల్చివేయడంతో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం పై ఆధారపడి జీవిస్తున్న చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటోందని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు కనవేన శ్రీనివాస్ అన్నారు.
సోమవారం మంథని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు... మార్కెట్‌ను తొలగించే ముందు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం, మౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. వ్యాపారులను రోడ్డున పడేసేలా చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్ వ్యాపారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న భూ ఆరోపణలను బీఆర్‌ఎస్ నాయకులు ఖండించారు. వెంకటాపూర్‌లో పుట్ట మధుకర్ కొనుగోలు చేసిన భూమిలో ఒక్క గుంట భూమి ఎస్సీలకు చెందినదని నిరూపిస్తే అంబేద్కర్ చౌరస్తాలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా మంత్రి మెప్పుకోసం రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పుట్ట మధుకర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
మంథని అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతామని వారు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ మాచిడి రాజుగౌడ్, మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, నాయకులు యాకూబ్, వేల్పుల గట్టయ్య, లక్ష్మణ్, కాయితి సమ్మయ్య, కొత్త బాలయ్య, ఎరుకల రవి, పెగడ శ్రీనివాస్, రోడ్డ శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, పోలు కనకరాజు, పుట్ట రాములు, మల్లేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.




