Sircilla: ఆలయాల అభివృద్ధికి నిధులు త్వరగా మంజూరు చేయాలి: ఏపీ మంత్రికి బీఆర్ఎస్ వినతి

Sircilla: సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట ఆలయాల అభివృద్ధికి టీటీడీ ప్రకటించిన రూ.13 కోట్ల నిధులను త్వరగా విడుదల చేయాలని ఏపీ మంత్రి ఆనంకు బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Nov 2026 8:38 PM IST
Sircilla
X

Sircilla: ఆలయాల అభివృద్ధికి నిధులు త్వరగా మంజూరు చేయాలి: ఏపీ మంత్రికి బీఆర్ఎస్ వినతి

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని రెండు ప్రముఖ ఆలయాల అభివృద్ధికి ప్రకటించిన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు తదితరుల బృందం విజయవాడలో మంత్రిని కలిసింది. సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎల్లారెడ్డిపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది.

గతంలో కేటీఆర్ విజ్ఞప్తి మేరకు ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణానికి సుమారు రూ.6 కోట్లు, సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రకటించిన నిధులను త్వరగా మంజూరు చేసి ఆలయ నిర్మాణ పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నర్సింలు, మీసం రాజం తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA