కాల్వ శ్రీరాంపూర్: ఫీజు బకాయిలపై బీఆర్ఎస్‌వీ బంద్, నేతల అరెస్టులు

కాల్వ శ్రీరాంపూర్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్‌వీ రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 29 April 2026 8:23 AM IST
కాల్వ శ్రీరాంపూర్
X

 కాల్వ శ్రీరాంపూర్

కాల్వ శ్రీరాంపూర్: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు బుధవారం ఉదయం నుంచే విద్యార్థి నాయకులు ఆందోళనలకు సిద్ధమయ్యారు.

ఈ బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాల్వ శ్రీరాంపూర్‌లో విద్యార్థి నాయకుడు నునేటి కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు కూకట్ల నవీన్ యాదవ్లను పోలీసులు తెల్లవారుజామునే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టుల అనంతరం నేతలు మాట్లాడుతూ, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేమని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

విద్యార్థి నేతలు ప్రధానంగా సుమారు రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా సంవత్సరం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యాసంస్థలు ఈ బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్‌వీ శ్రేణులు స్పష్టం చేశాయి.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story