Karimnagar: సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలి: చాడ వెంకట్‌రెడ్డి
Karimnagar: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Karimnagar: సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలి: చాడ వెంకట్‌రెడ్డి
కరీంనగర్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్నీ అధికారికంగా నిర్వహిస్తూ అన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అమరవీరుల స్ఫూర్తి కోసం స్మృతీ వనం ఏర్పాటు చేయాలని సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని కూరగాయల మార్కెట్ వద్ద గల సాయుధ పోరాటంలో ఎన్కౌంటర్ కు గురైన అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాల వేశాడు.
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానంలో భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం రజాకార్ల ఆగడాలను ఎదిరించడానికి 1947 సెప్టెంబరు 11న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి,మక్దూo మొహియుద్దీన్ లు పిలుపునిచ్చారని, ఆ పిలుపునoదుకొని తెలంగాణ ప్రాంతంలో నిజాం కు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిగిందని, ఆ పోరాట మూలంగా 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు దక్కిందని, 4,500 మంది అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, కమ్యూనిస్టుల పోరాటం మూలంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనం కాబడిందని గుర్తు చేశారు.
ఆ పోరాటాన్ని వక్రీకరించడానికి బిజెపి కుటిల ప్రయత్నం చేస్తుందని, ఆ పోరాటానికి బిజెపి పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని, ఆ పోరాటం హిందూ ముస్లింల పోరాటంగా అభివర్ణిస్తే చరిత్రహీనులవుతారని పేర్కొన్నారు.
గత అనేక సంవత్సరాలుగా సాయుధ పోరాటాన్ని కీర్తిస్తూ అధికారాన్ని చేజిక్కించుకున్న పాలక ప్రభుత్వాలు మాత్రం సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటని, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రత్యేక చొరవ తీసుకొని సాయిధ పోరాట స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని, ఆ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై పెట్టాలని, నాటి పోరాటమే లేకుంటే నేటి తెలంగాణ ప్రాంతమే లేనందున ఆ ఘట్టాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రజల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం చుట్టూ, కోతి రాంపూర్ బైపాస్ రోడ్డులో గల కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి విగ్రహం చుట్టూ సుందరీకరణ చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై ఇటు నగరపాలక సంస్థ పై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,టేకుమళ్ళ సమ్మయ్య, బోయిని తిరుపతి, న్యాలపట్ల రాజు,జిల్లా కౌన్సిల్ సభ్యులు బండ రాజిరెడ్డి,పైడిపెల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి,బీర్ల పద్మ,ప్రజా నాట్య మండలి కళాకారులు కె.స్వామి,లక్ష్మీనారాయణ,రాజయ్య,నాయకులు చెంచల మురళి,కాల్వ శ్రీనివాస్, మల్లయ్య, శ్రీనివాస్, రాజు,కొమురయ్య,బాపురెడ్డి,బీర్ల స్వాతి,విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.




