Gangadhara: లారీ ఎక్కి ధాన్యం కేంద్రానికి వెళ్లిన చొప్పదండి ఎమ్మెల్యే
Gangadhara: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతు సంక్షేమం కోసం వినూత్నంగా స్పందించారు.
Gangadhara: లారీ ఎక్కి ధాన్యం కేంద్రానికి వెళ్లిన చొప్పదండి ఎమ్మెల్యే
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆ హామీని కార్యరూపంలో చూపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలపై నిత్యం పర్యవేక్షణ కొనసాగిస్తూ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు.
ఇటీవల కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో లారీల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఈ పరిస్థితితో రైతులు ఆందోళన చెందుతుండగా, వారి ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా రంగంలోకి దిగారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా సమీపంలోని కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను మంగపేట చెక్‌పోస్ట్ వద్ద ఎమ్మెల్యే ఆపి, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపుకు సహకరించాలని లారీ యజమానులను కోరారు. రైతుల సమస్యను వారికి వివరించి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా ఎమ్మెల్యే స్వయంగా లారీలో కూర్చుని కొనుగోలు కేంద్రాలకు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ధాన్యం లోడింగ్ అనంతరం మిల్లులకు తరలించిన వెంటనే అన్‌లోడ్ అయ్యేలా తాను చర్యలు తీసుకుంటానని లారీ యజమానులకు హామీ ఇచ్చారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా చొప్పదండి నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.




