Karimnagar: రెవెన్యూ-ఇరిగేషన్ శాఖల సమన్వయంతోనే లక్ష్యాల సాధన కలెక్టర్!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ లో కలెక్టర్ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో సాగునీటి, రైల్వే, రహదారి ప్రాజెక్టుల భూసేకరణ పనులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 22 July 2026 6:21 PM IST
Karimnagar
X

Karimnagar: రెవెన్యూ-ఇరిగేషన్ శాఖల సమన్వయంతోనే లక్ష్యాల సాధన కలెక్టర్!

కరీంనగర్: జిల్లాలో చేపట్టిన కీలక సాగునీటి, రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని స్పష్టం చేశారు.

కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ, ఇరిగేషన్, భూ సేకరణ విభాగం,నేషనల్ హైవేస్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

సమీక్షలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్ కాలువలు, కాకతీయ కాలువ, కాలేశ్వరం ప్రాజెక్టు, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కరీంనగర్ మానేరు రివర్‌ ఫ్రంట్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత మేర భూసేకరణ పూర్తయింది, ఎంత పెండింగ్‌లో ఉంది, ఎదురవుతున్న సమస్యలు ఏమిటి, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్–జగిత్యాల ఫోర్‌లేన్ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పురోగతిపై ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంత సేకరించారు., ఇంకా ఎంత మిగిలి ఉంది, పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని వివరాలు తెలుసుకున్నారు.

అలాగే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ భూసేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్‌ఓబీలు) నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టుల ప్రభావిత రైతులకు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తికాని ప్రాంతాల్లో వెంటనే సర్వే చేపట్టి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేసి వివాదాలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాసం (ఆర్ అండ్ ఆర్) వంటి అంశాలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులు, ప్రజలకు నిబంధనల ప్రకారం సకాలంలో పరిహారం అందించి, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ఆలస్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, కరీంనగర్ ఆర్డీవో షర్మిల, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story