Karimnagar: ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మిక తనిఖీ!
Karimnagar: కలెక్టర్ చిత్రా మిశ్రా జిల్లా ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్)ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ఆదేశించారు.
Karimnagar: ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మిక తనిఖీ!
కరీంనగర్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి జిల్లా ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్)ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
తనిఖీలో భాగంగా సదరం వేయిటింగ్ హాల్, ఫార్మసీ, సిటీ స్కాన్ విభాగం, ఆరోగ్యశ్రీ కౌంటర్, సీనియర్ సిటిజన్ వార్డు, ఎమర్జెన్సీ వార్డు, సర్జికల్ రూమ్, ఓపీ విభాగం, ఆపరేషన్ థియేటర్, ఎన్‌ఎస్‌డీ క్లినిక్, పల్మనాలజీ వార్డులను పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఎంసీహెచ్ మాదిరిగా రోగులు, వారి సహాయకులు కూర్చునేందుకు తగిన బెంచీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆస్పత్రిలో ఎక్కడైనా లీకేజీలు, మరమ్మత్తులు అవసరమైన ప్రాంతాలు ఉంటే వెంటనే పూర్తి చేయాలని టీజీఎంఐడీసీ అధికారులను ఆదేశించారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, కనీస సౌకర్యాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని సూచించారు. ఫ్లోరింగ్, దెబ్బతిన్న గోడల మరమ్మత్తులు, తాగునీటి సరఫరా, వాటర్ స్టోరేజ్, విద్యుత్ పనులు, అంతర్గత రహదారులు, వైద్యుల గదుల్లో అవసరమైన సౌకర్యాలు, అదనపు బెడ్ల ఏర్పాటు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
వర్షపు నీరు ఆస్పత్రి ప్రాంగణంలో నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సేవలు అందించాలని, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా ప్రతి వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆస్పత్రి నిర్వహణపై సమగ్ర సమీక్ష. తనిఖీ అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి ఛాంబర్‌లో ఆర్‌ఎంఓ డాక్టర్ నవీనా, ఇతర వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వివరాలు, వారు పనిచేస్తున్న ఏజెన్సీలు, ఆస్పత్రి ఆదాయం-వ్యయాలు, నిధుల వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు.
ప్రతి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక ప్రాతిపదికన ఆదాయం-వ్యయాల బడ్జెట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రికి సంబంధించిన భవనాల అద్దెలు, అంబులెన్సులు, జనరేటర్లు, వైద్య పరికరాలు, ఏసీలు, సీసీ కెమెరాలు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్, ఆస్పత్రి నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్ నవీనా, వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




