Sircilla: సిరిసిల్ల ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీల అభివృద్ధిపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ దిశానిర్దేశం. నిధుల వినియోగం, పారిశుధ్యం, సీజనల్ వ్యాధులపై అధికారులకు ఆదేశాలు.
Sircilla: సిరిసిల్ల ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
సిరిసిల్ల: ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామపంచాయతీలు అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించుకుని తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సిరిసిల్లలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఇల్లంతకుంట, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... గ్రామాల జనాభా, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, వీబీజీ గ్రాంట్లు, ఇతర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగించి మౌలిక వసతులు, మురుగునీటి కాలువలు, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
గ్రామాల్లో తాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, నాలుగు రకాల చెత్త బుట్టల వినియోగం, సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డెంగ్యూ, టైఫాయిడ్ నియంత్రణ కోసం ఫాగింగ్, డ్రైడే నిర్వహణ, నిల్వ నీరు తొలగింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించాలని సూచించిన కలెక్టర్... గ్రామపంచాయతీల ఆదాయం పెంచేందుకు ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని స్పష్టం చేశారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి జయశీలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.




