Sircilla: బోయినపల్లిలో మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు!

Sircilla: బోయినపల్లిలో మహిళా సంఘాల సభ్యుల కోసం 30 రకాల ఆరోగ్య పరీక్షలతో కూడిన ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 20 Aug 2026 4:17 PM IST
Sircilla
X

Sircilla: బోయినపల్లిలో మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు!

Sircilla: మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాన్ని గురువారం బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు కేవలం రుణాలు అందించడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకే పరిమితం కాకుండా మహిళల గుర్తింపు, సంక్షేమం, సాధికారతతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో మహిళలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తుంటారని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళల్లో రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఈ-ఆరోగ్యం యాప్ ద్వారా పరీక్షల వివరాలను నమోదు చేస్తున్నామని, వైద్య పరీక్షల ఫలితాలను మహిళల మొబైల్ ఫోన్లకు మెసేజ్ ద్వారా పంపిస్తామని వివరించారు. అవసరమైన వారు వైద్యులను సంప్రదించి సూచనలు, చికిత్స తీసుకోవాలని సూచించారు.

మొదటి దశలో బోయినపల్లి, వేములవాడ, వీర్నపల్లి, కోనరావుపేట, తంగళ్ళపల్లి మండలాల్లో మహిళా సంఘాల సభ్యులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బోయినపల్లి మండలంలోని 31 విలేజ్ ఆర్గనైజేషన్ల పరిధిలో 819 స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 9,424 మంది సభ్యులకు దశలవారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రతిరోజూ 50 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

మహిళలు సమూహంగా వ్యాపారాలు నిర్వహించేందుకు, కొత్త యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, వైద్యారోగ్య శాఖ అధికారిణి ఏంజెలా అల్ఫ్రెడ్, సర్పంచ్ మోహన్, మండల ప్రత్యేక అధికారి శరత్, తహసీల్దార్ షరీఫుద్దీన్, వైద్యులు, మహిళా సంఘాల సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story