Sircilla: సిరిసిల్ల కేజీబీవీలో 150 మంచాలను ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్!
Sircilla: రాజన్న సిరిసిల్ల కేజీబీవీ పాఠశాలలో సీఎస్‌ఆర్ కింద 150 మంచాలు ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపు.
Sircilla: సిరిసిల్ల కేజీబీవీలో 150 మంచాలను ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్!
Sircilla: సిరిసిల్ల కేజీబీవీలో సీఎస్‌ఆర్ కింద అందించిన 150 మంచాలు, బెడ్స్ ప్రారంభం. విద్యార్థులు మంచిగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్) కింద జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు అందించిన 150 మంచాలు, బెడ్స్‌ను సోమవారం సిరిసిల్లలోని కేజీబీవీ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి పాఠశాలలో అందుతున్న వసతులు, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నదా? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, వసతులను సద్వినియోగం చేసుకుని మంచిగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో వసతులు, భోజన నాణ్యతను పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అందిస్తున్న సేవలను కలెక్టర్ అభినందించారు. విద్యార్థి పుట్టిన ప్రాంతం, ఆర్థిక పరిస్థితి, నేపథ్యం ఏదైనా విద్యలో ప్రతిభ చూపేందుకు అవి అడ్డంకులు కావని స్పష్టం చేశారు.
ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతను గుర్తించి ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పెద్దలను గౌరవిస్తూ విలువలతో కూడిన విద్యార్థులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదవాలని కలెక్టర్ సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగం లేదా స్వయం ఉపాధిలో స్థిరపడడంతో పాటు సమాజానికి తిరిగి సేవ చేయాలనే భావనను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, జీసీడీఓ పద్మజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే. రాజీవ్ కుమార్, బ్యాంక్ చీఫ్ మేనేజర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




