Sircilla: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి రైతులకు కలెక్టర్ పిలుపు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతంపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్షించారు.

KALEEM, SIRICILLA
Published on: 18 July 2026 11:55 PM IST
Sircilla
X

Sircilla: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి రైతులకు కలెక్టర్ పిలుపు!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల, మిషన్ భగీరథ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎంపీడీఓలతో జరిగిన సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో లేవని, ప్రస్తుతం ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతోందని, సాగునీటి లభ్యత పరిమితంగా ఉండే అవకాశం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో రైతులు వరికి బదులుగా స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అలాగే ప్రతి గ్రామంలో ఫాం పాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే తప్పనిసరిగా నిర్వహించాలని, పరిశుభ్రత, మరిగించిన నీరు తాగడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story