Sircilla: భూ రీ సర్వేలో కచ్చితత్వం పాటించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Sircilla: భూ భారతి రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కుర్దులింగంపల్లిలో రోవర్ సర్వే పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

KALEEM, SIRICILLA
Published on: 25 Aug 2026 5:48 PM IST
Sircilla
X

Sircilla: భూ రీ సర్వేలో కచ్చితత్వం పాటించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్!

సిరిసిల్ల: భూ భారతి కింద చేపడుతున్న భూముల రీ సర్వేను కచ్చితత్వంతో, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో రోవర్ యంత్రంతో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే యంత్రం ద్వారా భూముల వివరాలను ఎలా సేకరిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామ సరిహద్దు సర్వే పూర్తయిందని, ప్రస్తుతం ప్రభుత్వ భూముల సర్వే కొనసాగుతోందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూ భారతి కింద రీ సర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వేకు ముందు రైతులకు ముందస్తు సమాచారం అందించాలని, భూములకు సంబంధించిన ప్రతి వివరాన్ని పూర్తి కచ్చితత్వంతో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

బోర్‌వెల్ రీచార్జ్ పనుల పరిశీలన

గంభీరావుపేట మండలం గజసింగవరంలో గ్రామ బోర్‌వెల్ వద్ద చేపడుతున్న రీచార్జ్ నిర్మాణ పనులను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని రైతులు, గృహ నిర్మాణదారులు బోర్‌వెల్ రీచార్జ్ పనులు చేపట్టేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏడీ సర్వే శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేందర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story