Sircilla: తిప్పాపూర్ గోశాలలో కోడెల సంరక్షణపై కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు!
Sircilla: వేములవాడ రాజన్న తిప్పాపూర్ గోశాలను రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు.
Sircilla: తిప్పాపూర్ గోశాలలో కోడెల సంరక్షణపై కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు!
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కోడెల పంపిణీ అనంతరం మంగళవారం తిప్పాపూర్ గోశాల ఆవరణను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా గోశాలలోని అన్ని షెడ్లను పరిశీలించిన కలెక్టర్.. ఒక్కో షెడ్లో ఎన్ని కోడెలు ఉన్నాయో, వాటికి అందిస్తున్న ఎండు గడ్డి, పచ్చి గడ్డి, దానా వివరాలను అడిగి తెలుసుకున్నారు. గోశాలలో ఉన్న ఆవుల సంఖ్యపై కూడా అధికారులను ఆరా తీశారు.
కోడెలకు సమయానుసారంగా పశుగ్రాసం, తాగునీరు, దానా అందించాలని కలెక్టర్ సూచించారు. గోశాల ఆవరణను నిత్యం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనారోగ్యంతో ఉన్న లేదా ఇతర కారణాలతో ప్రత్యేక సంరక్షణ అవసరమైన జీవాలను ప్రత్యేక షెడ్‌లో ఉంచి, వాటికి ప్రత్యేక దానాతో పాటు అవసరమైన వైద్యం అందించాలని ఆదేశించారు.
కోడెల షెడ్లలో అవసరమైన మేరకు మరిన్ని కూలర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కోడెల ఆరోగ్యం, వసతుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే.ఎస్.బీ. కుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.




