Sircilla: ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించండి.. కలెక్టర్

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలో ప్రజావాణి. 144 దరఖాస్తుల స్వీకరణ. గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 7 July 2026 6:44 AM IST
Sircilla
X

Sircilla: ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించండి.. కలెక్టర్

సిరిసిల్ల: ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 144 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అప్పగించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించే ప్రజావాణికి సంబంధించిన దరఖాస్తులపై కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

ఇదే రోజు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించారు. సిరిసిల్లలో 4, వేములవాడలో 2 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖితారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story