Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ!

Sircilla: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో టెలీ-మానస్ 14416 పోస్టర్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె ఆవిష్కరించారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Sept 2026 8:51 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ!

సిరిసిల్ల: మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడేవారు మనోధైర్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు. ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా గురువారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో టెలీ-మానస్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 14416 పోస్టర్లను కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి. గితె, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఏంజెలా ఆల్ఫ్రెడ్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఆత్మహత్యల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. యువత, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడానికి బదులుగా వాటిని దాచిపెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని, సమస్యల గురించి మాట్లాడేందుకు కూడా కొందరు వెనుకాడుతున్నారని తెలిపారు. మానసిక సమస్యలకు సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం ఎంతో అవసరమన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయని, చికిత్స ఉచితంగా అందిస్తామని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఆత్మహత్యల నివారణకు టెలీ-మానస్‌ 14416 ద్వారా 24 గంటలు, వారంలో ఏడు రోజులు సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వైద్యుల సూచనల మేరకు మందులను సూచించిన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మానసిక సమస్యలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆత్మన్యూనత భావనతో బాధపడుతున్న వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు అండగా నిలిచి ధైర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నయీమా జహా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story